మెదక్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీ వాన(rain effect)కు జనజీవనం అతలాకుతలమైంది. పట్టణంలోని గాంధీనగర్ వీధిలో పది ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇళ్లలోకి నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంట్లోని వస్తువులన్నీ నీటిలో తడిసిపోయాయని తెలిపారు. కొన్ని వస్తువులు వరదలో కొట్టుకుపోయాయని చెప్పారు.
వరద నీరు చేరిన ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు.. వారిని బంధువుల ఇళ్లకు పంపించారు. ఘటనాస్థలికి చేరుకున్న డీఎస్పీ సైదులు.. నీటమునిగిన ఇళ్లను పరిశీలించారు. ఫైర్ ఇంజిన్ సాయంతో నీటిని తొలగించేలా చర్యలు తీసుకున్నారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల(rain effect)కు మెదక్ జిల్లాలో ఉన్న వనదుర్గ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తోన్న వరద నీటితో పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం సమీపంలో వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 0.135 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టు అలుగు పారడం వల్ల 1536 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ప్రమాద ఘటనలు చోటుచేసుకోకుండా ఔట్ పోస్టు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.