కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మానవత్వం చూపాల్సిన అవసరం ఎంతో ఉంది. బాధితులను ఆదుకునేందుకు ఎవరికి వారుగా ముందుకు రావాలి. అయితే పలు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యం మాత్రం కొవిడ్ బారిన పడ్డ వారి నుంచి ఇష్టానుసారంగా డబ్బులు గుంజుకున్నాయి. ఆస్పత్రుల్లో చేరగానే రూ.లక్షల్లో బిల్లులు కట్టించుకున్నాయి. నిలువు దోపిడీకి పాల్పడ్డాయి. ఈ విషయమై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పందించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరిచుకున్నాయి. అధిక బిల్లులు వసూలు చేసిన వారి నుంచి తిరిగి ఇప్పించాలని ఆదేశాలివ్వడం గమనార్హం.
ఆస్తులను కోల్పోయి..
అన్ని వర్గాలపై పంజా విసురుతున్న కొవిడ్‌తో ధనికులు సైతం పేదలుగా మారుతున్నారు. అన్ని రంగాలను కుదిపేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడిపోవాల్సిన దుస్థితి. కరోనా బారిన పడ్డవారిలో అస్వస్థతకు గురై ప్రాణాలను నిలబెట్టుకునేందుకు ఎంతోమంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే అదునుగా వాటి నిర్వాహకులు మాత్రం అందిన కాడికి దండుకున్నాయి. కొందరు తమ భూములను అమ్మి చికిత్సకు డబ్బులు సమకూర్చుకున్నారు. మరికొందరు దొరికిన కాడల్లా అప్పులు చేసి తీసుకొచ్చి మరి వెచ్చించారు. ఇంకొందరు తమ ఆస్తులను కుదవ పెట్టారు. అయినా తమ కుటుంబసభ్యులనూ దక్కించుకోలేక కొందరు తల్లడిల్లిపోతున్నారు. చికిత్స పొంది ఆరోగ్యంగా ఇంటికొచ్చిన వారు మిగిలిన అప్పులను ఎలా తీర్చాలో అర్థం కాక తలచుకొని బెంబేలెత్తుతున్నారు. ఇలాంటి వారికి ఉపశమనం కలిగించేలా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో నామమాత్ర చర్యలకే పరిమితమైన యంత్రాంగం ఆ దిశగా దృష్టిసారిస్తుందో.. లేదో వేచిచూడాల్సిందే.
మచ్చుకు నిదర్శనాలివిగో...
* జోగిపేట పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మే నెలలో కరోనా బారిన పడ్డారు. కుటుంబసభ్యులు ఆయనను సంగారెడ్డిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మే 1 నుంచి మే 3వ తేదీ వరకు అక్కడే ఉంచారు. ఈ రెండు రోజులకు ఏకంగా రూ.92 వేలు బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఆహారం, మందులు, పీపీఈ కిట్ పేరిట రూ.20 వేలు, రూం ఛార్జీలు రూ.24 వేలు.. ఇలా బిల్లు వేశారు. రెండు రోజుల తర్వాత బాధితుడి కుటుంబీకులు అతడిని హైదరాబాద్‌లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎనిమిది రోజుల పాటు చికిత్స పొందిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఆ ఆసుపత్రి వారు రూ.7 లక్షలు బిల్లు వేశారు. ఇద్దరు వైద్యులు చూసినందుకు వారికే రూ.1.04 లక్షల బిల్లు వేసినట్లు చూపారు. ఆక్సిజన్ ఛార్జీలు రోజుకు రూ.10 వేల చొప్పున వసూలు చేశారు. బెడ్ ఛార్జీ రూ.64 వేలు ఇలా బిల్లుగా వేసిన మొత్తాన్ని రూ.7 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. బయట నుంచి తెచ్చిన ఇంజెక్షన్లు, మందుల పేరిట మరో రూ.5 లక్షల వరకు వెచ్చించామని బాధితుడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
* అందోలు మండలం మన్‌సాన్‌పల్లికి చెందిన ఒకరు సంగారెడ్డిలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఏడు రోజుల పాటు కరోనా చికిత్స తీసుకున్నారు. అయినా ప్రయోజనం దక్కలేదు. ఆసుపత్రిలోనే అతడు కన్నుమూశాడు. ఆయన్ను బతికించుకునేందుకు దాదాపు రూ.4 లక్షల వరకు ఖర్చు చేశామని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
* శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన వ్యక్తి కరోనాతో చికిత్స పొందుతూ జిల్లా శివారులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో మృత్యువాత పడ్డాడు. 21 రోజుల పాటు అతడికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇందుకోసం రూ.10లక్షల వరకు ఖర్చయింది. అయినా అతడి ప్రాణాలు దక్కలేదు. చివరకు ఈ కుటుంబం అప్పులపాలైంది. ఉన్న కాస్త భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది.
* నర్సాపూర్‌కి చెందిన 35 ఏళ్ల యువకుడితో పాటు అతడి తల్లికి కరోనా సోకింది. సంగారెడ్డిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 12 రోజుల పాటు చికిత్స పొందిన యువకుడు చనిపోయాడు. అతడి తల్లి దాదాపు 17 రోజులు ఇదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. చివరకు ఆమె ప్రాణాలతో బయటపడింది. వీరిద్దరికీ కలిపి రూ.7 లక్షలు ఖర్చయ్యాయి.
* కొడంగల్‌కు చెందిన తపాలా ఉద్యోగి కొవిడ్ బారిన పడగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. రూ.2.50 లక్షలు బిల్లు వేశారు. అయినా తగ్గకపోవడంతో కుటుంబీకులు మరో ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించగా 15 రోజులు అక్కడే ఉండగా రూ.5 లక్షలు ఖర్చయ్యాయి. ఈ క్రమంలో ఆయన భార్యకు సైతం పాజిటివ్‌గా తేలడంతో ఆమెకు రూ.3 లక్షలు వెచ్చించాల్సి వచ్చింది. ఇలా దంపతులిద్దరికీ రూ.10.50 లక్షలు ఖర్చయ్యాయి.
ఊరట కలిగేలా..
ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేశారు. వైద్యాధికారులు కొంచెం దృష్టిసారించి తనిఖీలు పక్కాగా చేపడితే వాస్తవాలు వెలుగు చూస్తాయి. కానీ ఆ దిశగా చొరవ కానరావడం లేదు. ఇకనైనా స్పందించి తగు చర్యలకు ఉపక్రమిస్తే వాస్తవాలెన్నో వెలుగు చూడటం ఖాయం. ఈ కోణంలో అధికారులు ప్రయత్నిస్తే బాధితులకు కొంతలో కొంత ఉపశమనం దక్కుతుంది.
ఫిర్యాదు చేసినా..
అధిక బిల్లులు వసూలు చేసినా, ఇతరత్రా ఏవైనా సమస్యలున్నా కంట్రోల్ రూంకి సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో ఇదే అంశమై కొందరు ఫిర్యాదులూ చేశారు. కానీ ఆ అంశమై కనీసం విచారణ కూడా చేపట్టలేదు. జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి డాక్టర్ గాయత్రీదేవిని వివరణ కోరగా.. కంట్రోల్ రూం నుంచి ఇప్పటి వరకు తమకు ఫిర్యాదులు గురించిన సమాచారం ఏదీ అందలేదని చెప్పారు. కలెక్టరుకు నేరుగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టామన్నారు. అయిదు ఆసుపత్రుల్లో ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించి తాఖీదులు ఇచ్చామని, వీటిలో మూడింటిలో కొవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేశామని వివరించారు. ప్రభుత్వం సూచించిన ధర కంటే అధికంగా బిల్లులు వసూలు చేస్తున్నట్లు విచారణలో తమ దృష్టికీ వచ్చిందన్నారు. అయితే మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఇప్పటి వరకు కనీసం ఒక్క ఆసుపత్రిపైనా చర్యలు కూడా తీసుకోకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి: SP Balu: సినీ నేపథ్యగానానికి 'ప్రాణ'సుబ్రహ్మణ్యం