ఇఫ్కో ఆధ్వర్యంలో రామాయంపేట మండల పరిధిలోని కోనాపూర్ సహకార సంఘం పెట్రోలు బంకు ఆవరణలో ఎమ్మెల్యే దంపతులు మొక్కలు నాటారు. మొక్కజొన్న, పత్తి పంటలు బిందు సేద్యం విధానంలో సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే పంటలు సాగు చేయాలని పద్మా దేవేందర్‌రెడ్డి సూచించారు. మిగిలిన సంస్థల కంటే ఇఫ్కో ఎరువులు తక్కువ ధరలకు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇఫ్కో ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇఫ్కోలో కొనుగోలు చేసిన ఒక్కో ఎరువు బస్తాపై రూ.4 వేల చొప్పున 25 బస్తాల వరకు రైతులకు బీమా సౌకర్యం ఉంటుందని ఇఫ్కో డైరెక్టర్, కోనాపూర్ సహకార సంఘం ఛైర్మన్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. అనంతరం రైతులకు వేప మొక్కలు అందజేసి, మొక్కలు నాటారు.
కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన ఇఫ్కో డైరెక్టర్ కలయంతి, స్థానిక సర్పంచి చంద్రకళ, రెండు మండలాల ఎంపీపీలు భిక్షపతి, సిద్ధరాములు, జడ్పీటీసీ సభ్యులు సంధ్య, విజయ్ కుమార్, ఇఫ్కో జనరల్ మేనేజర్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్ మారుతి కుమార్, క్షేత్ర అధికారి చంద్రన్న, హైదరాబాద్ మేనేజర్ రాజగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.