గత రబీ కంటే ఈసారి మూడింతల ధాన్యం సేకరణ ఆశిస్తున్నామని.. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యాసంగి ధాన్యం సేకరణపై మెదక్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ముద్రించిన ధాన్యం మద్దతు ధర పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
కొత్త కొనుగోలు కేంద్రాలు..
గత రబీలో 78 వేల ఎకరాల్లో రైతులు పంట వేయగా ఈ యాసంగిలో 2 లక్షల 12 వేల ఎకరాల్లో వరి వేసినట్లు తెలిపారు. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12న 350 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 55 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు మాత్రమే ఉన్నాయని తెలిపిన మంత్రి... అక్కడ ఉన్న ధాన్యాన్ని తరలించాలని సూచించారు. రాష్ట్రంలోని మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలకు తరలించాల్సిందిగా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను ఫోన్ ద్వారా కోరారు. కొత్త ధాన్యాన్ని ఖాళీ అయిన గోదాముల్లో భద్రపరచాలని చెప్పారు.
తాలు లేకుండా..
రైతులు 17 శాతం తేమ మించకుండా, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తేనే మద్దతు ధర లభిస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ విషయాన్ని రైతులకు తెలిసేలా ప్రతి కేంద్రం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నిర్వహణపై ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు శిక్షణ ఇవ్వవలసిందిగా ఆదేశించారు. ఏ రోజు ధాన్యం ఆ రోజు మిల్లులకు తరలించేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ యరీష్, అదనపు కలెక్టర్ రమేష్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'సింగరేణి మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి'