గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలన్ని నిండాయని.. ఈత కోసం, చేపల వేటకు పిల్లలు, పెద్దలు నీటి ప్రవాహాల దగ్గరకు వెళ్లకూడదని మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలపై స్థానిక పోలీసులు నిఘా వేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో కలిసి పని చేయాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ సూచించారు. వరద ఉద్ధృతి కారణంగా రోడ్లు తెగిపోయినా, చెరువులు, కుంటల కట్టలు తెగిపోయినా, గండి పడినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజలను అటుగా వెళ్లడం నిరోధించాలని పోలీసులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. నీటి ప్రవాహం ఉన్న రోడ్లకు రెండు వైపులా ప్లాస్టిక్ కోన్స్, తాడు, ఇతర వస్తువలు అడ్డు పెట్టి ఎవరినీ అటుగా అనుమతించకూడదని సూచించారు. ఆయా గ్రామాల సర్పంచులకు, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం చేరవేయాలని ప్రజలను కోరారు. పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు వరద ఉద్ధృతి వల్ల ప్రమాదాలు సంభవించకుండా ప్రమాద నివారణ చర్యలను చేపట్టడానికి సిద్దంగా వుండాలని సూచించారు.
పట్టణాలలో, గ్రామాల్లో మట్టితో కట్టిన పురాతన ఇండ్ల గురించి సమాచారం సేకరించి.. కూలిపోయే దశలో ఉన్న ఇళ్లలోంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని, నదీపరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆమె ఆదేశించారు. వాగులు నదులు ఉద్ధృతిని అంచనా వేస్తూ వరద ముంపునకు గురయ్యే గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
ప్రస్తుత పరిష్టితుల్లో వాగులు, చెరువులు, కుంటలు వర్షపు నీటితో నిండి ప్రమాద స్థాయికి చేరిన క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలను కుటుంబ సభ్యులను ఈతకు, చేపల వేటకు, సరదాగా చూసేందుకు అనుమతించవద్దని కోరారు. నిర్విరామంగా కురిసే వర్షాల కారణంగా విద్యుత్ స్థంభాలకు విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉందని, విద్యుత్ స్థంభాలకు దూరంగా ఉండాలని, వాటిని తాకరాదని ఎస్పీ సూచించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరా ఆగిపోయినా, విద్యుత్ సమస్యలు తలెత్తినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా ట్రాఫిక్ మళ్లించాలని సూచించారు. ఏదైనా విపత్కర సమస్య వస్తే డయల్ 100, జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 7330671900, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 08452-223533 నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.
ఇదీ చూడండి : 'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'