భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని అందించాలనే గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్రం గ్రంథాలయం ఆవరణలో, డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి మొక్కలు నాటారు. మెదక్ నియోజకవర్గంలో ఉన్న అడవులు పెంపొందించాలని.. రాబోయే కాలానికి స్వచ్ఛమైన హరిత తెలంగాణ అందించాలని పేర్కొన్నారు. ప్రజలందరూ చురుకుగా హరితహారంలో పాల్గొని మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సూచించారు.
జాతీయ అటవీ విధానం ప్రకారం 23 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంపొందించే విధంగా అందరూ ప్రయత్నం చేయాలని శాసనసభ్యులు పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. రాబోవుకాలంలో కొవిడ్ లాంటి వైరస్ల బారిన పడకుండా కాలుష్యం లేని రాష్ట్రంగా ఉండాలంటే మొక్కలు నాటాలని తెలిపారు. కాళేశ్వరం ద్వారా మెదక్ నియోజకవర్గంతో పాటు ఏడు జిల్లాలకు నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. నియంత్రిత సాగు విధానం ద్వారా డిమాండ్ ఉన్న పంటలు పండించి దళారీ వ్యవస్థను రూపుమాపడమే కాకుండా.. రైతు వేదికలను నిర్మించి రైతులను సంఘటితం చేయాలనేది సీఎం కేసీఆర్ ఆశయమని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: జిల్లాలో ఒక్క రోజే 1.15 లక్షల మొక్కలు నాటాం: కేటీఆర్