తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పట్ల మక్కువతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. రైతులు ఆర్థికంగా ఎదగాలని రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతోందని చెప్పారు. మెదక్ నియోజకవర్గానికి సంబంధించి సింగూర్ ద్వారా ఎంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్‌కు విడతల వారీగా నీళ్లు విడుదల చేశామని వెల్లడించారు.
రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఉండాలని.. మెదక్ జిల్లాలో 358 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ మండలం మాచవరం, హవేలీ ఘన్పూర్ మండలం పరిద్పూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో వరి పంట వేశారని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ధాన్యాన్ని తాలు లేకుండా కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
- ఇదీ చదవండి : లోటస్‌పాండ్‌లో దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల