Harish Rao Went to Padma Devender Reddy Nomination in Medak : పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎంత సురక్షితంగా ఉంటుందో.. అలాగే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తెలంగాణ కేసీఆర్ చేతిలోనే ఉంటే బాగుంటుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు(Harishrao) అన్నారు. మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నామినేషన్(Padma Devender Reddy Nomination)లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్‌లో ముమ్మాటికీ పద్మ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ గెలుపు.. మెదక్‌లో పద్మ గెలుపును ఎవరూ ఆపలేరని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కేసీఆర్ ఉండగా ఇతర పార్టీలకు ఓటు వేసి రిస్క్ ఎందుకు తీసుకోవాలని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణ తరహాలో సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదని చెప్పారు.
Minister Harishrao Fires on Congress : రాష్ట్రంలో ఆసరా పింఛన్, రైతుబంధు(Rythu Bandhu Scheme) పెంచాలన్నా.. కల్యాణ లక్ష్మి కావాలన్నా బీఆర్‌ఎస్ చేయగలుగుతుందని అన్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఏది కావాలన్న దిల్లీకి పోవాలని ఎద్దేవా చేశారు. టికెట్ కావాలన్న దిల్లీకే పోవాలి.. ప్రచారం కావాలన్న దిల్లీ నాయకులే రావాలని తెలిపారు. దిల్లీ పార్టీలను నమ్ముకుని మోసపోవాల్సిన అవసరం లేదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వడానికి ఆగమాగం అయిపోతుందని విమర్శించారు. అర్రస్ పాట పాడినట్లు టికెట్లు తక్కట్లో పెట్టి అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని తెలిపారు.
మెదక్ నుంచి పద్మాదేవేందర్ రెడ్డిని గెలిపించాలి : ఇలాంటి వీళ్లు రాష్ట్రాన్ని పరిపాలిస్తారా అంటూ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. వీరి చేతిలో రాష్ట్రం పెడితే కుక్కలు చింపిన విస్తరాకు అవుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. మెదక్ నియోజకవర్గంలో పద్మాదేవేందర్ రెడ్డి 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పని చేశారని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. దాదాపు 22 ఏళ్లు పార్టీకి సేవ చేశారన్నారు. ఉద్యమ సమయంలో కూడా మహిళ అయిండీ.. ఎన్నోసార్లు అరెస్టు అయ్యారన్నారు. ఎన్నో నిరాహార దీక్షలు, రైల్వే రోకోలో ఉన్నారని పేర్కొన్నారు.
"రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉండడం సబబు అయితే.. మెదక్ పద్మ చేతిలో ఉండడం మంచిది. తెలంగాణ అభివృద్ధి జరగాలన్న.. మెదక్ అభివృద్ధి సాగాలన్న రెండు చోట్ల కారు గుర్తును గెలిపించాలి. మెదక్ ఖిల్లా మీద గులాబి జెండా ఎగురవేయాలి. మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరు." - హరీశ్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
Telangana Election Polls 2023 : ఇలాంటి వ్యక్తిని గెలిపిస్తే రాబోయే రోజుల్లో మెదక్‌ను పరుగులు పెట్టించొచ్చని అన్నారు. అభివృద్ధి ఎలా చేయాలో తెలియని వ్యక్తులు మెదక్‌లో మాట్లాడుతున్నారు.. అసలు అభివృద్ధి అంటే వారికి తెలుసా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రం కేసీఆర్ చేతిలో.. మెదక్ పద్మాదేవేందర్ రెడ్డి చేతిలో ఉండడం సబబు అంటూ తేల్చి చెప్పారు. తెలంగాణ, మెదక్ అభివృద్ధి చెందాలన్న రెండు చోట్ల కూడా కారు గుర్తుకే ఓటేయాలని సూచించారు. మెదక్ ఖిల్లా మీద గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రచారంలో 'కరెంట్' మంటలు - బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మాటల తూటాలు