Harish Rao Reacts To Bangalore IT Raids Today : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నేడు మెదక్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో జరిగిన ఐటీ దాడులపై ఆయన స్పందించారు. బెంగళూరులో ఐటీ దాడుల్లో కాంగ్రెస్ నేతల ఇంట్లో రూ.42 కోట్లు దొరికాయన్న ఆయన.. ఎన్నికల్లో డబ్బులు పంచి గెలిచేందుకు హస్తం పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆ రాష్ట్రంలో పలువురు వ్యాపారుల నుంచి రూ.1500 కోట్లు వసూలు చేశారన్న మంత్రి.. అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణకు చేరవేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో ఏ బిల్డింగ్, అపార్ట్‌మెంట్ నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వాలన్నా 70 శాతం కమీషన్ ఇవ్వాలని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని ఆక్షేపించారు.
Harish Rao Fires on Congress Party : అవినీతి సొమ్మును తెలంగాణకు తీసుకొచ్చి ఖర్చు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. దాదాపు రూ.1500 కోట్లను బెంగళూరు నుంచి వయా చెన్నై ద్వారా హైదరాబాద్ తరలించాలని ఒక పథకం ప్రకారం పని చేస్తున్నారన్నారు. ఈ మేరకు ఇప్పటికే కొంత డబ్బు చెన్నైకి చేరగా.. మరికొంత హైదరాబాద్‌కు చేరినట్లు తెలుస్తుందని మంత్రి తెలిపారు. కర్ణాటక సొమ్మును తెలంగాణకు పంపించడంలో పలువురు బిల్డర్స్, వ్యాపారస్థులు ప్రధాన పాత్ర వహిస్తున్నారన్న మంత్రి.. రాజకీయాలకు, వారికి ఏం సంబంధం లేదన్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా వ్యాపారస్థులు రాజకీయాలు చేస్తే.. తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
ఎన్ని కలలు కన్నా.. అవి పగటి కలలే.. : కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బునంతా.. దొడ్డిదారిన తెలంగాణకు చేరవేస్తుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హస్తం పార్టీ ఎన్ని కలలు కన్నా పగటి కలలు అవుతాయి తప్ప.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. ముమ్మాటికి కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఉన్నవాళ్లకే టికెట్ ఇస్తుందని.. ఆ పార్టీ నాయకులు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. అభ్యర్థుల నుంచి వసూలు చేసిన డబ్బును మంచి నీళ్లలా పంచి తెలంగాణలో గెలవాలని చూస్తున్నారని.. హస్తం పార్టీకి తెలంగాణలో తగిన గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు.
"బెంగళూరులో ఐటీ దాడుల్లో కాంగ్రెస్ నేతల ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయి. అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణకు చేరవేస్తోంది. ఎన్ని కలలు కన్నా పగటి కలలు అవుతాయి తప్ప.. తెలంగాణలో ముమ్మాటికీ కేసీఆర్ గెలుస్తారు. ఎన్ని నోట్ల కట్టలు పంచినా.. గెలుపు మాత్రం బీఆర్ఎస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఉన్నవాళ్లకే టికెట్ ఇస్తుంది. అభ్యర్థి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బును ఎన్నికల్లో పంచి.. తెలంగాణలో గెలవాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో తగిన గుణపాఠం తప్పదు." - మంత్రి హరీశ్‌రావు