Edupayala Temple Controversy : మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా భవానీ మాత ఆలయానికి సంబంధించిన బంగారం తరలింపు వ్యవహారం వివాదాస్పదం అయింది. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ఈవో శ్రీనివాస్ ఆలయానికి సంబంధించిన బంగారాన్ని శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఉంచుకోవడం, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శనివారం పొద్దున్నే బ్యాంక్ లాకర్లో పెట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు, ఆభరణాల తనిఖీ అధికారిని అంజనా దేవి, ఉమ్మడి మెదక్ జిల్లా సహాయ కమిషనర్ శివరాజ్, నాణ్యత నిపుణులు మెదక్ చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.
ఆలయానికి సంబంధించిన లాకర్ ఉన్న ఇండియన్ బ్యాంక్‌కు చేరుకుని.. బంగారాన్ని కరిగించేందుకు ఈవో హైదరాబాద్ ఎప్పుడు వెళ్లారు.. అక్కడి నుంచి మెదక్ ఎప్పుడు చేరుకున్నారు. లాకర్లో ఎప్పుడు భద్రపరిచారు. ఎంత పరిమాణం ఉంది అనేది ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆర్జేసీ మాట్లాడుతూ బంగారాన్ని, వెండిని తీసుకొని వచ్చి ఈవో ఇంట్లో పెట్టుకోవడం చట్ట విరుద్దమని.. బంగారానికి ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని.. శాఖాపరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
Congress and BJP leaders protest :ఏడుపాయల అమ్మవారికి భక్తులు సమర్పించిన బంగారం వెండి ఏడుపాయల ఆలయ ఈవో సారా శ్రీనివాస్ ఇంటి వద్ద పెట్టుకోవడాన్ని నిరసిస్తూ ఈవో శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయాలని జిల్లా కాంగ్రెస్, బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు
''అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బ తీయకుండా చూడాలని ఆర్జేసీని కోరాను. పాలకవర్గానికి నోట్ ఫైల్ పెట్టకుండా.. బంగారాన్ని మింటుకు తరలించడం సరికాదు. భక్తులు అమ్మవారికి సమర్పించిన సొమ్మును పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తీసుకురావడం ఏంటి? ఈవో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. దానివల్ల ఆలయానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఏడుపాయల ఆలయానికి సంబంధించిన అకౌంట్ మెదక్ ఇండియన్ బ్యాంకులో ఉంది. దానికి సంబంధించిన చెక్కుల వివరాలు పాలక వర్గానికి చెప్పడం లేదు. ఏడుపాయల ఈవోకు ఒకరికే చెక్ పవర్ ఉండటం వల్ల అనేక అక్రమాలు జరుగుతున్నాయి. దేవాదాయ రీజనల్ జాయింట్ కమిషనర్ దృష్టికి అనేక తీర్మానాలు చేసినప్పటికీ.. ఏ ఒక్క పనీ జరగలేదు. ''- ఆలయ ఛైర్మన్ బాలా గౌడ్
''మింటు నుంచి బంగారం, వెండి తీసుకుని బయటకు వచ్చేసరికి సాయంత్రం 6.30 అయ్యింది. మెదక్ వచ్చేసరికి 10:30 అయింది. బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్ చేసినప్పటికీ తనకు జ్వరం ఉందని బ్యాంకుకు రావడం కుదరదు అన్నారు. బ్యాంకులో పెట్టుకోవడానికి అవకాశం లేదని తెలిపారు. దాంతో నా కారులో ఇంటి వద్దకు తీసుకెళ్లాను. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి కూడా చెప్పాను. దానితో ఐదుగురు కానిస్టేబుల్స్ మా ఇంటి వద్ద బందోబస్తు ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కూడా పెట్టుకోమని జిల్లా ఎస్పీని కోరాను. అక్కడ లాకర్ సదుపాయం లేకపోవడంతో మా ఇంటి వద్దనే ఉన్న బంగారానికి, వెండికి పోలీసులు బందోబస్తు ఇచ్చారు. ఏడుపాయల ఆలయ ఈవో ఛైర్మన్‌కు నాలుగు రోజుల నుంచి ఫోన్ చేసినప్పటికీ తను ఫోన్ ఎత్తడం లేదు. ఉదయం పోలీసుల సహాయంతో బంగారాన్ని, వెండిని ఏడు గంటల 15 నిమిషాలకు లాకర్లో భద్రపరచడం జరిగింది.''-ఏడుపాయల ఆలయ ఈవో సార శ్రీనివాస్
జనవరిలో అయోధ్య ఆలయ ప్రతిష్ఠ!.. హోటళ్లు, రిసార్ట్లు హౌస్‌ఫుల్..