పీఆర్సీ కమిటీ నివేదికపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ తొలి పీఆర్సీ అత్యంత దుర్మార్గంగా ఉందంటూ వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కాముని రమేష్ ఆధ్వర్యంలో స్థానిక హెడ్ పోస్టాఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా ప్రధాన కార్యదర్శి జస్టిస్ ఎల్లం ఆధ్వర్యంలో, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ ఆధ్వర్యంలో రాందాస్ చౌరస్తాలో పీఆర్సీ ప్రతులు తగులబెట్టి నిరసన తెలిపారు.
63 కోరితే 7.5 శాతమా..?
చరిత్రలోనే ఇంత దారుణమైన పీఆర్సీ సిఫారసులను చూడలేదని ఆయా యూనియన్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 63 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరితే కేవలం 7.5 శాతం ఫిట్మెంట్ ప్రతిపాదించడం అత్యంత దారుణమన్నారు. ఆయా నిరసన కార్యక్రమాల్లో టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్లు, తపస్ జిల్లా ఉపాధ్యక్షులు కోని సుధాకర్, మెదక్ మండల అధ్యక్షులు గుజ్జరి రవి, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఐక్య వేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పీఆర్సీపై ఉద్యోగసంఘాల ఆగ్రహం.. పోలీసుల అప్రమత్తం