మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు. ప్రభుత్వం రైతుల కోసం నిర్మించ తలపెట్టిన రైతు వేదికలను వీలైనంత త్వరగా నిర్మించి ఇవ్వాలని ఆయన అన్నారు. మెదక్ పట్టణం, చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి, చేగుంట, రామాయంపేట, నిజాంపేటతో పాటు మెదక్ మండలం పాతూర్ ప్రాంతాల్లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయా మండలాల్లో నిర్మించనున్న రైతువేదికల స్థలాలను పరిశీలించారు. స్థలాలను ఎంపిక చేసిన గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలను ఆగస్టు 15వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించరాదన్నారు. మెదక్ జిల్లాలో ఆయా క్లస్టర్లకు సంబంధించిన రైతు వేదికల నిర్మాణ పనులకు సంబంధించిన కొంత సామాగ్రి ఇప్పటికే వచ్చిందని, వాటి నిర్మాణ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం వర్షకాలం సీజన్ కావడం వల్ల కొన్ని చోట్ల పనులు ప్రారంభించారని.. మరికొన్ని చోట్ల నిలిచిపోయాయని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని అనుకున్న సమయానికి రైతువేదికల నిర్మాణాలను పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ ఆదేశించారు. రైతువేదికల నిర్మాణాల విషయంలో మండల స్థాయి ప్రత్యేకాధికారులు, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని, పనుల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు.
ఆయా మండలాల్లో తహశీల్దార్లు సైతం రైతు వేదికల నిర్మాణాలకు తమవంతు సహకారాన్ని అందించడమే గాక పనుల పురోగతిని పరిశీలించాలన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్‌తో పాటు.. జిల్లా వ్యవసాయాధికారి పరశురాం నాయక్, ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం