A young Man Who Set Up a Nursery: ఉన్నత చదువులు, ఉత్తమమైన ఉద్యోగం.. ఇదే కదా యువత ఆలోచన. కానీ ఈ విధానానికి స్వస్తి చెప్తున్న కొందరు యువకులు.. తమకు నచ్చిన రంగంలో స్వశక్తితో ఎదిగి పది మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధమోతున్న తరుణమిది. అలాంటి ఆలోచనతోనే ముందడుగు వేసిన ఈ యువకుడు.. 5ఏళ్ల పాటు శ్రమించి వనాన్నే సృష్టించాడు.
ప్రకృతిపై మక్కువ కలిగిన ఇతగాడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి మరీ లక్ష్య ఛేదనలో ముందడుగు వేసి, 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ప్రకృతిపై ఉన్న ఇష్టంతో వ్యాపారవేత్తగా ఎదిగిన అతని పేరు ఖానాపురం రవీంద్రారెడ్డి. హైదరాబాద్ శివారు గాజులరామారం గ్రామానికి చెందిన యువకుడు 2013లో ఎమ్.టెక్ పూర్తి చేశాడు. కొన్నాళ్ల పాటు హైదరాబాద్, బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేశాడు.
A Young Man Providing Employment to 15 People: ఆ సమయంలో సెలవుల్లో స్వస్థలానికి వచ్చే అతను మెదక్ జిల్లా నాగసాన్‌పల్లిలోని మేనమామకు ఉన్న నర్సరీకి వెళ్లి అక్కడి పరిస్థితులను అవగతం చేసుకునేవాడు. బెంగుళూరులో ఉద్యోగం చేసేటప్పుడు అతనికి సమయం దొరికినప్పుడల్లా నర్సరీలకు వెళ్తూ, అక్కడి పూల తోటలకు మరింత ఆకర్షితుడయ్యాడు. ఈ క్రమంలో ప్రకృతికి మంత్రముగ్దుడైన యువకుడు తానే ఓ నర్సరీని ఏర్పాటు చేయాలనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా ఉద్యోగానికి స్వస్తి చెప్పి, లక్ష్యం దిశగా అడుగులేసినట్లు చెబుతాడు యువకుడు. 2017లో నాగసానిపల్లిలోని శ్రీరాఘవేంద్ర నర్సరీ, ప్లాంటేషన్స్‌ను టెకాఫ్ చేశాడు. 26 ఎకరాల్లో ఆగ్రో ఫారెస్ట్రీ నడిపిస్తున్న అతను సీజన్ల వారీగా 10 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలతో పాటు మామిడి, సపోట, బొప్పాయి, జామ, అరటి, కూరగాయల పంటలు సాగు చేస్తున్నాడు. 3 ఎకరాల్లో పశువులు, మత్స్య పెంపకం జోడించాడు.
మరో 3 ఎకరాల్లో పూలు సహా ఇతర మొక్కలను పెంచుతున్నాడు. వాటిని ప్రకృతి ప్రేమికులకు విక్రయిస్తూ వ్యాపారాభివృద్ధిలో ప్రతిభ కనబరుస్తున్నట్లు చెబుతాడు. ఆగ్రో ఫారెస్ట్రీలో 254 రకాల జాతుల మొక్కలు, అంట్లు, ప్లాంటేషన్స్, చెట్లు ఇలా రకరకాల మొక్కలను పెంచుతున్నాడు. ప్రత్యేకించి 10 ఎకరాల్లో ఆస్ట్రేలియన్ టేకు, శ్రీగంధం, టేకు, ఎర్రచందనం, రోజ్‌వుడ్, వేగిసా, మహాఘని, చిందుగ, జిట్రేగు, గుమ్మడి టేకు, మలబారువేప, వెదురు తదితర నాణ్యమైన కలపనిచ్చే మొక్కలు పెంచుతూ విక్రయిస్తున్నాడు.
ఆ చెట్లన్నీ ఏటికేడు పెద్దవవుతుండటంతో, పచ్చదనంతో కళకళలాడుతోందని అంటాడు యువకుడు. చెట్లు, మొక్కల పెంపకంలో వస్తున్న మార్పులను గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తూ అధ్యయనం చేస్తాడు రవీంద్రారెడ్డి. వాటిని తన ఆగ్రో ఫారెస్ట్రీలో అవంభిస్తాడు. రాబోయే 5, పదేళ్లలో నర్సరీలో అన్ని రకాల మొక్కలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు చెబుతాడు యువకుడు.
ఆగ్రో ఫారెస్ట్రీలోని చెట్ల నుంచి వచ్చిన కలపను టింబర్ డిపోల్లో విక్రయిస్తున్నాడు. దీంతో ఓ వైపు ప్రకృతిపై ప్రేమను చాటుకుంటూనే 15 మందికి ఉపాధిని కల్పిస్తున్నాడు. ప్రకృతిపై మక్కువతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి, వ్యాపారవేత్తగా ఎదిగిన అతను ఐదేళ్ల పాటు శ్రమించి ఇంతటి విజయాన్ని సొంతం చేస్తుకున్నాడు. నచ్చిన రంగంలో స్వశక్తితో రాణిస్తూ, 15మందికి ఉపాధిని కల్పిస్తున్న యువకుడు, సాధించాలనే పట్టుదల ఉంటే సాధ్యం కానిదేది లేదని సూచిస్తున్నాడు.
ఇవీ చదవండి: