మేనరికం ఆ దంపతుల పాలిట శాపంగా మారింది. వారికి జన్మించిన బాలుడికి నరకంగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకుందామని అనుకున్న తమ కుమారుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని ఆ తల్లిదండ్రులు ఆవేదనతో.. ఆదుకోవాలని కోరుతున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల అప్పాజీపల్లి గ్రామానికి చెందిన రెడ్డి యాదగిరి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. అతనికి మేనమామ కూతురుతో పెళ్లైంది. వారికి మొదటి సంతానంగా కుమారుడు జన్మించాడు.
ఎంజైమ్స్ లోపంతో వ్యాధి..
మొదటి సంతానం మగపిల్లవాడు జన్మించటంతో కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా బాబును పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో బాలుడికి ఐదేళ్లొచ్చినా ఎత్తు పెరగకపోవటంతోపాటు పొట్ట పెరగడం ప్రారంభించింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు మెదక్‌లోని పిల్లల ఆస్పత్రిలో చూపించారు. ఫలితం లేకపోవటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చారు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు బాలుడికి గాంచర్స్ అనే అరుదైన వ్యాధి సోకినట్లు తెలిపారు. ఎంజైమ్స్ లోపం వల్ల ఈ వ్యాధి వస్తుందని.. ఆపరేషన్ చేసేందుకు వీలు లేదని తేల్చి చెప్పారు.
14 రోజుల ఒక్కసారి ఇంజక్షన్ ఇప్పించాలి..
ఈ వ్యాధి నివారణకు ఏకైక మార్గం ఇంజక్షన్ అని దాని విలువ రూ. 1.20 లక్షలు వరకు ఉంటందని.. 14 రోజుల ఒక్కసారి ఇంజక్షన్ ఇప్పించాలని వైద్యులు తెలిపినట్లు యాదగిరి చెప్పారు. తన కొడుకుని బతికించుకోవాడానికి తమకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని.. కౌలు చేస్తూ జీవనం గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికంతో తల్లడిల్లుతున్న తాను 14 రోజులకు ఒకటి చొప్పున ఇంజక్షన్ ఇప్పించడం సాధ్యం కాదని కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఆదుకోవాలని అభ్యర్థన..
కళ్ల ముందు బిడ్డ నడవలేని స్థితిలో చూసి నరకం అనుభవిస్తున్నాని తల్లి లావణ్య కన్నీరుమున్నీరవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, ఎవరైనా దాతలు ముందుకొచ్చి తన కొడుకుని కాపాడాలని కొంగుపట్టి వేడుకుంటున్నారు. భూ తల్లిని నమ్ముకుని బతుకుతున్న తమకు ఇంత పెద్ద కష్టం రావడం తట్టులేకపోతున్నామని బాలుడి నాన్నమ్మ అనసూయ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం చేయించలేని పేదరికంలో ఉన్న వారికి దాతలు సాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం పెడతాం: బండి సంజయ్