రాష్ట్రంలో అత్యధికంగా తాగునీటి అవసరాలు తీరుస్తోన్న మంచిర్యాల జిల్లా శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం రోజు రోజుకూ తగ్గుతోంది. మండు వేసవి కావడం వల్ల జలాశయంలో నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. 20.175 టీఎంసీల పూర్తి సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న 7.9 టీఎంసీల నీటిని కాపాడుకోవలసి ఉంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నీటి పారుదల శాఖ అధికారులు కేవలం తాగునీటి అవసరాలు తీర్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
డెడ్ స్టోరేజీకి దగ్గర్లో...
గతేడాదితో పోలిస్తే ఈసారి నీటి వినియోగం గణనీయంగా పెరిగింది. జనవరిలో నీటి మట్టం 146.70 మీటర్లు ఉండగా మూడు నెలల వ్యవధిలో 141 మీటర్లకు తగ్గింది. ప్రాజెక్టు ద్వారా మంచిర్యాల జిల్లాకు సాగునీరు, హైదరాబాద్ వాసులకు తాగునీరు, జైపూర్, సింగరేణి విద్యుత్ కేంద్రాలకు అవసరమైన నీటిని సరఫరా చేస్తున్నారు. మరోవైపు మిషన్ భగీరథ, నంది మేడారం జలాశయానికి సైతం ఈసారి దీని ద్వారానే నీటినందించారు. జలాశయానికి ఇన్‌ఫ్లో లేకపోగా... ఔట్‌ఫ్లో మాత్రం రోజుకు 1074 క్యూసెక్కులకు పైగానే ఉంటోంది. ప్రస్తుతం వెంనూరు పంపుహౌస్‌కు సరఫరా నిలిపేశారు. జలాశయ నిల్వ సామర్థ్యం 148 మీటర్లు కాగా... 138 మీటర్ల నీళ్లు వాడుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 141 మీటర్లకు చేరుకుంది. డెడ్ స్టోరేజీకి దగ్గరగా ఉండడం వల్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు.
7 టీఎంసీలే దిక్కు...
మే నెలలో ఎండలు మరింత అధికమయ్యే అవకాశాలు ఉండటం వల్ల ఆవిరి రూపంలో వృథా అయ్యే నీటి శాతం పెరగడం... తాగునీటి అవసరాలకు వినియోగంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు మరింత అడుగంటి పోనున్నాయి. వర్షాలు కురిసి ప్రాజెక్టు నిండడానికి కనీసం 50 రోజుల వ్యవధి ఉంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో వర్షాలు కురిసి ఎల్లంపల్లికి జూలైలో గానీ నీళ్లందవు. ఈ నేపథ్యంలో రెండు నెలల పాటు ఉన్న 7 టీఎంసీలనే జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది. ఈలోపు నీటిని పొదుపుగా విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి : వనస్థలిపురం చోరీ... తమిళనాడు ముఠా పనేనా?