పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు మంచిర్యాల జిల్లా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారుల మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా పరీక్ష కేంద్రాల్లో సదుపాయాలు, విద్యార్థుల భౌతికదూరం పాటిస్తూ పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రాల పెంపు, అవసరమున్న ఇన్విజిలేటర్లు, పర్యవేక్షక అధికారుల నియామకాలతో పాటు శానిటైజర్లు, మాస్క్‌లు తదితర అవసరాలపై జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మార్చి 19న పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ పరీక్షలు ముగియగా మరో 4 సబ్జెక్టులకు సంబంధించివి మిగిలాయి. జిల్లాలో ఈ సంవత్సరం, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సంబంధించి 11,081 మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 55 పరీక్ష కేంద్రాలు 100 నుంచి 110కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదనపు పరీక్ష కేంద్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇన్విజిలేటర్లు, డిపార్టుమెంట్ అధికారులు, కస్టోడియన్లను రెట్టింపు చేసే పనిలో ఉన్నారు. కేంద్రాలను తప్పనిసరిగా శానిటైజ్ చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే విద్యాశాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జిల్లా విద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు, సలహాలు అందించారు.
రవాణా సమస్యే సవాలు
రవాణా సమస్య అధిగమించడమే అధికారులకు సవాలుగా మారింది. పరీక్ష కేంద్రాలు లేని గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు 40 శాతం వరకు ఉంటారు. వీరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేవారు. మరికొందరు ప్రైవేటు వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు చేరుకునేవారు. ప్రస్తుతం ఆర్టీసీ రవాణా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.