మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఉపరితల గని పనుల్లో జరిగిన ప్రమాదంలో ఎన్నపురెడ్డి మహేశ్ అనే కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. సర్వే పనుల్లో భాగంగా ప్రమాదవశాత్తు మహేశ్ నీటి మడుగులో పడిపోయి ఊపిరాడక చనిపోయాడు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు.
గుత్తేదారుని నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తూ... మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించకుండా అడ్డుకున్నారు. మృతుని కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించి.. ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జైపూర్ ఏసీపీ నరేంద్ర ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. అనంతరం మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.