మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. వర్షాకాలం ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం... హైదరాబాద్ నగర దాహార్తి, ఎన్టీపీసీకు అవసరాలు, మిషన్ భగీరథ పథకానికి నీటి సరఫరా కారణంగా జలాశయం నీటి మట్టం క్రమంగా తగ్గుతూ వస్తోంది. మరో వైపు నీరు ఆవిరిగా మారి నీటి నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి.
నీటి వినియోగం ఇలా...
ఎల్లంపల్లి జలాశయం ద్వారా గతేడాదితో పోలిస్తే నీటి వాడకం గణనీయంగా పెరిగింది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. గరిష్ఠ నీటి మట్టం 148 మీటర్లు. ఈ ఏడాది జూన్ 22 నాటికి నీటి నిల్వలు 5.58 టీఎంసీలకు పడిపోయాయి. ప్రస్తుతం జలాశయ నీటి మట్టం 140.58 మీటర్లకు చేరుకుంది. జనవరి నుంచి ఏప్రిల్ చివరి వారం వరకు జలాశయం నుంచి ఎన్టీపీసీ, హైదరాబాద్ మెట్రోవాటర్ వర్స్క్, మంచిర్యాల జిల్లాలోని గూడెం ఎత్తిపోతలకు నీటిని విడుదల చేస్తూ వచ్చారు. దీంతో జలాశయంలోనీ నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వస్తోంది.
రోజురోజుకు పడిపోతున్న నిల్వలు
అడపాదడపా ఎగువన వర్షాలు కురిస్తే తప్ప వర్షాకాలం ప్రారంభమైనా జలాశయంలోకి ఇన్‌ఫ్లో నామమాత్రంగానే ఉంటోంది. గడిచిన 24 గంటల్లో ఇన్‌ఫ్లో 891 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 622 క్యూసెక్కులకు పైగానే ఉంటోంది. యాసంగి పంట కాలం ముగియడం వల్ల మంచిర్యాల జిల్లాలోని గూడెం ఎత్తిపోతల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. వేసవి తాపం కారణంగా ప్రతి రోజు 102 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది.
మిగిలింది 2.28 టీఎంసీలే...
ఎల్లంపల్లి జలాశయం డెడ్ స్టోరేజి 3.30 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 5.58 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 148 మీటర్లకు గాను 138 మీటర్ల మేర నీరు వాడుకునే వెసులుబాటు ఉండగా ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 140.58 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం అవసరాలకు వాడుకోవడానికి జలాశయంలో కేవలం 2.28 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది.
గతేడాది జూన్ 1 నుంచి జలాశయంలోకి ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలు (టీఎంసీలు) ఇలా
● ఏడాది వ్యవధిలో జలాశయంలోకి మొత్తం ఇన్‌ఫ్లో: 222.824
● అందులో పార్వతి పంపుహౌజ్ ద్వారా వచ్చి చేరిన నీరు: 53.771
● నంది పంపు హౌజ్ ద్వారా విడుదలైన నీరు: 68.631
● క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు వదిలిన నీరు: 141.55
జలాశయంలోకి ప్రస్తుతం రోజు వారీగా ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో, నీటి వినియోగం(క్యూసెక్కుల్లో)
● ఇన్‌ఫ్లో: 891
● ఔట్ ఫ్లో : 622
●ఎన్టీపీసీ: 121
● హైదరాబాద్ తాగునీటి అవసరాలకు: 331
● మిషన్ భగీరథ(పెద్దపల్లి జిల్లా): 39
● మిషన్ భగీరథ (మంచిర్యాల జిల్లా): 29
● ఆవిరిగా మారుతున్న నీరు: 102
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్