మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో వారం రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన ప్రాజెక్టు.. వారం రోజుల వ్యవధిలోనే నిండుకుండలా మారింది. సోమవారం ఒక్కరోజే దాదాపు 4 టీఎంసీలకు పైగా నీరు జలాశయంలోకి వచ్చి చేరింది.
గోదావరి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లికి వరద భారీగా వచ్చి చేరుతోంది. సోమవారం రాత్రి వరకు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటం వల్ల అధికారులు 8 గేట్లను ఎత్తి 82 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 19.455 టీఎంసీలుగా ఉంది.
హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, ఎన్టీపీసీ పవర్ ప్లాంట్, మిషన్ భగీరథ నీటి పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు. నంది పంప్‌హౌజ్, వేమునూరు పంప్‌హౌజ్, గూడెం ఎత్తిపోతల పథకానికి నీటి సరఫరా నిలిపివేశారు.