మంచిర్యాల జిల్లా నస్పూర్లో పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ భారతీ హోళీ కేరి, రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ ఛైర్మన్ దామోదర్, ఎమ్మెల్యే దివాకర్ రావు, రామగుండం సీపీ సత్యనారాయణ ప్రారంభించారు. కోటి రూపాయల వ్యయంతో 3753 చదరపు అడుగుల స్థలంలో పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించారు. ఒక్కో పోలీస్ స్టేషన్ నిర్వహణకు నగరాల్లో నెలకు రూ.75 వేలు , జిల్లా కేంద్రాల్లో రూ.50 వేల, మండలాల్లో రూ.25 వేలను అందిస్తోందన్నారు.
భయాన్ని పోగొట్టడమే లక్ష్యం...
ఠాణా అన్నా, పోలీసులన్నా ప్రజల్లో నెలకొన్న భయాలను పోగొట్టి ప్రజలకు స్నేహితులుగా సేవచేసే విధంగా పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్దామన్నారు. నిజాం కాలం నాటి పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఆధునీకరించిందని రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు.
అత్యాధునిక సాంకేతికత...
పంజాగుట్ట, గచ్చిబౌలి, ఆదిభట్ల ఠాణాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల సీఎం, ఉన్నతాధికారులు సందర్శించి రాష్ట్ర పోలీస్ వ్యవస్థను అభినందించారని కోలేటి దామోదర్ రావు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.