సింగరేణి వ్యాప్తంగా మందమర్రి ఏరియాలో మంకీ ఫుడ్ కోట్లను ఏర్పాటు చేసేందుకు జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి సాధించారు. శంకరపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఏడాది క్రితమే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10 ఎకరాల్లో 1463 మొక్కలను నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

మూగజీవాల కోసం
వాటిలో మామిడి 661, పనస 239, సపోటా 195, ఉసిరి 21, జామ 228, కొబ్బరి 115, నిమ్మ 4 చెట్లను పెంచుతున్నారు. ఇందులో మొదటి విడతగా 1,073 మొక్కలు, రెండో విడతగా 390 మొక్కలను నాటారు. కోతుల కోసమే కాకుండా మూగజీవాలు, పక్షుల కోసం టమాట, వంకాయ, బెండ, కాకర, పుచ్చకాయ మొక్కలను పెంచుతున్నారు.

తోట చుట్టూ సింగరేణి యాజమాన్యం ఇనుప కంచె ఏర్పాటు చేసి.. కాపలాగా ఇద్దరు వ్యక్తులను నియమించారు. భూగర్భం నుంచి వచ్చే నీటిని మొక్కలకు వాడుతున్నారు. మూగజీవాలకు నీరు అందించేందుకు నిత్యం నీటిని అందుబాటులో ఉంచుతున్నారు.

కోతుల ఫుడ్ కోర్టు
సీఎండీ డైరక్టర్ల చొరవతోనే తాము ఇక్కడ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగుతున్నామని ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. మందమర్రి ఏరియా నలుమూలల ఏడు చోట్ల 28 ఎకరాల సింగరేణి స్థలంలో వీటిని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కోతులు, మూగజీవాలకు ఆహారం అందించాలనే సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో వీరంగం... పోలీసులపై దాడులు