పర్యావరణ పరిరక్షణకు నిర్దేశించిన అటవీ చట్టాలకు విఘాతం కలగుకుండా అన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలను మెరుగుపరిచేందుకు రోడ్ల నిర్మాణం ఎంతో ఆవశ్యకమని మంత్రి పేర్కొన్నారు. చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్ధిపై రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులతో మంత్రి చర్చించారు.
అటవీ ప్రాంతంలో రోడ్లను నిర్మించేందుకు సంబంధిత శాఖల అధికారులు చేసే ప్రతిపాదనల దశలోనే అటవీశాఖ అధికారులతో సంప్రదించాలన్నారు. అటవీశాఖ అభ్యంతరాలు ఉన్న రహదారుల నిర్మాణ విషయమై సమగ్ర సర్వే నిర్వహించి తగిన సాంకేతిక వివరాలతో మ్యాపులను తయారు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో సీసీఎఫ్ వినోద్ కుమార్, మంచిర్యాల, చెన్నూరు ఎఫ్డీవోలు నాగభూషణం, రాజారావు, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దుర్గం చిన్నయ్య, పీసీసీఎఫ్ శోభ తదితరులు పాల్గొన్నారు.