రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలుపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సింగరేణి అతిథిగృహంలో అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సాగు కోసం నీటి లభ్యత, నిరంతర విద్యుత్ అందించడం వల్ల మంచిర్యాల జిల్లాలో వరిధాన్యం దిగుబడి రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చిందని మంత్రి తెలిపారు. రైస్ మిల్లర్లు, హమాలీల సమస్యలను సమావేశంలో అధికారులతో చర్చించామని మంత్రి వెల్లడించారు.
జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం గోదాములలో నిల్వ చేసి.. 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కరీంనగర్ జిల్లాకు పంపించే విధంగా అధికారులకు ప్రతిపాదనలు పంపామని అన్నారు. ఈ నెలాఖరు వరకు రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో విప్ సుమన్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రైల్వే పనుల పూర్తికి ప్రణాళికలు రూపొందించాలి: కేటీఆర్