జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పురపాలక శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో రైల్వే ప్రాజెక్టు పనుల పురోగతి, పలు పనుల భూసేకరణపై చర్చించారు. ద.మ.రైల్వే జీఎం గజానన్ మాల్యా, మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండీ ఎస్వీఎస్ రెడ్డిలు పాల్గొన్నారు.
నగరంలో రోడ్ల పనులకు సంబంధించి రైల్వేశాఖతో సమన్వయంపై చర్చించిన మంత్రి.. రోడ్ల నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీ వేగంగా చేపడుతోందని కితాబిచ్చారు. ఎస్‌ఆర్‌డీపీ, లింక్ రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యాయని తెలిపారు.
పలుచోట్ల రైల్వే వంతెనల వల్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయన్న మంత్రి .. రైల్వే సహకారంతో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో చేపట్టిన ఆర్వోబీ, ఆర్‌యూబీల వారీగా సమీక్షించిన కేటీఆర్.. రైల్వే అధికారులు జలమండలి మౌలిక వసతుల ప్రాజెక్టులపై రైల్వే జీఎంతో చర్చించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి.. ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూడాలని మంత్రి కోరారు. వర్షాకాలంలోగా ఎక్కువ చోట్ల రైల్వే పనుల పూర్తికి అధికారులు కృషి చేయాలన్నారు. పనుల పూర్తికి ప్రణాళికలు రూపొందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.