బతుకమ్మ పండుగకు.. ఆడబిడ్డలకు కానుకగా.. ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున చీరలు పంచుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 11వ వార్డులో ఆయన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బతుకమ్మ చీరల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.317 కోట్లు కేటాయించిందని.. చీరల తయారీలో 28 వేల నేతన్నల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఐకేపీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి చీరలను అందజేయాలని ఆదేశించారు. కుల,మతాలతో సంబంధం లేకుండా అందరికీ.. చీరల పంపిణీ జరుగుతుందన్నారు. మొత్తం 287 డిజైన్లు, 10 నుంచి 12 రంగుల్లో నేతన్నలు చీరలు రూపొందించారని.. తమకు నచ్చిన చీరలు మహిళలు ఎంచుకోవచ్చని తెలిపారు.
మంచిర్యాల జిల్లాకు 2.40 లక్షల చీరలు వచ్చాయని.. జిల్లాలో నాలుగు రోజుల్లో చీరల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పండుగ కానుకలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యాఖ్యానించారు.
పండుగ సమయంలో కేసీఆర్ ఆడబిడ్డలకు అండగా.. పెద్దన్నలా వ్యవహరిస్తున్నారని.. కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని.. దేశానికే నమూనాగా మార్చారని తెలిపారు. జిల్లా పాలనాధికారి భారతి హోళ్లి కెరీ, ఆర్టీఓ శ్యామలదేవి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు టి.సత్యనారాయణ, మున్సిపల్ ఛైర్పర్సన్ జక్కుల శ్వేత, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కల్యాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, తహశీల్దార్ కుమారస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- ఇదీ చూడండి :ఎయిమ్స్‌లో కిషన్ రెడ్డి.. వైద్యులతో సమీక్ష