మంచిర్యాలకు చెందిన మోహనకృష్ణ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. తనకుండే తీరిక సమయాన్నంతా మొక్కల పెంపకం, పక్షుల పరిరక్షణకు ఉపయోగిస్తుంటారు. వివిధ మాధ్యమాల ద్వారా మొక్కల వెరైటీలు, ఔషధ మొక్కల గురించి తెలుసుకుంటూ తన పెరట్లో పెంచుతుంటారు. తన అభిరుచితో ఇంటినే పచ్చదనానికి ప్రయోగశాలగా మార్చారు. తులసి, తిప్పతీగ, పొన్నగంటి, వాము, సరస్వతి దవనం, నల్లేరు అనేక రకాల ఔషధ మొక్కలు మోహనకృష్ణ ఇంట్లో దర్శనమిస్తాయి. ఇంట్లో ప్రాణవాయువు నాణ్యత పెంచేలా.. జడ్ జడ్ ప్లాంట్, స్నేక్ జాతి, ఆర్క ఫాన్స్, జో జో ప్లాంట్, క్రోటన్స్, గ్రీన్ బార్డర్ తదితర మొక్కలు సుమారు వందకు పైగా నాటారు. మోహనకృష్ణ ఇంట్లో ఎక్కడ చూసినా పచ్చదనం పరిమళిస్తూ ఆహ్లాదాన్ని పంచుతోంది.
మెళకువలు నేర్చుకుంటూ..
వివిధ మాధ్యమాల ద్వారా మొక్కల పెంపకంలో మెళకువలు నేర్చుకుంటూ నూతన పద్ధతులను మోహనకృష్ణ అవలంబిస్తున్నారు. అంతరించిపోతున్న పిచ్చుకలు, ఇతర పక్షుల పరిరక్షణకూ తనవంతు కృషిచేస్తున్నారు. తనకు నచ్చిన పక్షులను పెంచుతూనే పిచ్చుకలకు గూడు కల్పించి నీరు,ఆహారం అందిస్తూ కాపాడుతున్నాడు. తాను అవలంభించే పద్ధతులన్నీ రసాయనాలు లేకుండానే ఉంటాయని మోహనకృష్ణ చెబుతున్నారు.
మొక్కలు నాటాలి
పచ్చదనం పెంచేందుకు కాస్త సమయం, ప్రకృతిని కాపాడుకోవాలన్న స్పృహ ఉంటే చాలంటున్న మోహనకృష్ణ... ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నారు.
ఇదీ చదవండి: కదల్లేని స్థితిలోనూ.. కట్టిపడేసే కళాకృతులు