మంచిర్యాల జిల్లాకు చెందిన అన్నదమ్ములు నిరుద్యోగ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన సోలమాన్ జోన్స్ ఎంజీఐటీలో 2019లో ఎంటెక్ పూర్తిచేశారు. ఎంటెక్ చదువుతున్న సమయంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేశారు. కోర్సు పూర్తికాగానే బెల్లంపల్లికి వచ్చారు. 2014లో ఎంటెక్ పూర్తి చేసిన అతని సోదరుడు డేనియల్ కమలాకర్.... మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదులుకుని ఆయన సైతం గతేడాది బెల్లంపల్లికి వచ్చారు.
అన్నదమ్ములు చౌడేశ్వర్‌లో ఎలక్ట్రికల్ దుకాణం ప్రారంభించారు. ఇద్దరూ కలిసి 'లవ్లీ స్మార్ట్ యాప్' రూపొందించారు. ఈ యాప్ ద్వారా ఇంట్లో విద్యుత్ ఉపకరణాలను ఆపరేట్ చేసేలా తయారు చేశారు. ఫ్యాన్లు, లైట్లు, టీవీలు, కంప్యూటర్‌ను మొబైల్‌తో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసేలా రూపుదిద్దారు. సోలామాన్ జోన్స్‌ను ఇటీవల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరీ ఓ కార్యక్రమంలో అభినందించారు.
వీరు తయారు చేసిన ఈ పరికరం స్విచ్ బోర్డుకు బిగించుకోవాలి. ఒకేసారి ఎనిమిది పరికరాలు పనిచేసేలా రూపొందించారు. అంతేకాకుండా కరోనా వేళ స్థానికంగా ఆన్‌లైన్ యాప్ ప్రారంభించి... నిత్యావసర సరుకులు, కూరగాయల సరఫరా చేస్తున్నారు. ఈ యాప్ వల్ల మరో 11 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
ఇవీ చదవండి: శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు సీజే మహేశ్వరి