విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సదుద్దేశంతో 2013-14లో జలమణి పథకం ద్వారా పాఠశాలలకు శుద్ధజల యంత్ర పరికరాలకు సరఫరా చేశారు. కొన్ని పాఠశాలల్లో వాటిని అమర్చక పోవడం.. అమర్చిన వాటిల్లో నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల పరికరాలు వృథాగా మారాయి.
లక్షలాది రూపాయలు దుర్వినియోగం..
జిల్లాలో ఐదేళ్ల క్రితం మండల విద్యాధికారులు నీటివసతి ఉన్న పాఠశాలలను గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారుల సహకారంతో ఎంపిక చేశారు. వాటి వివరాలను ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించగా.. శుద్ధజల యంత్ర పరికరాలు మంజూరయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని సుమారు 85 పాఠశాలలకు రెండు విడతలుగా పరికరాలను సరఫరా చేశారు.
విస్మరించారు
నీటిని శుద్ధిచేసే యంత్రంతో పాటు ట్యాంకు, వివిధ పరికరాలను పాఠశాలలకు అందించి చేతులు దులుపుకున్నారు. వాటిని పాఠశాలల్లో అమర్చి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే విషయాన్ని సంబంధిత అధికారులు పూర్తిగా విస్మరించారు.
అలంకారప్రాయంగా మారిన యంత్రాలు
కొన్ని పాఠశాలల్లో శుద్ధ జల యంత్రాలు ఏర్పాటు చేసినా... అవి ముణ్నాళ్ల ముచ్చటగానే మారాయి. నీటిని శుద్ధిచేసే యంత్రాలు, ట్యాంకు, తదితర పరికరాలు ఆయా పాఠశాలల్లోని గోడలకు పరిమితమై అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. వాటికి మరమ్మతులు చేపట్టినా.. ప్రయోజనం లేనివిధంగా మారాయి. ఈ విషయంపై మండల విద్యాధికారులకు సరైన సమాచారం లేకపోవడం వల్ల ఏమీ చేయలేక పోతున్నారు.శుద్ధజలం అందించే పేరుతో లక్షలాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయే తప్ప విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కొన్ని పాఠశాలల్లో మాత్రం దాతల సాయంతో పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు.
- ఇదీ చూడండి : 'మహీ... రిటైర్మెంట్ ఆలోచన రానీయొద్దు'