మంచిర్యాల జిల్లాలోని కడెం ఆయకట్టు చివర వరకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా చేపట్టారు. జన్నారం మండలం తపాలాపూర్ చెక్ పోస్టు వద్ద జన్నారం, దండేపల్లి మండలాల రైతులు రాస్తారోకో నిర్వహించారు. యాసంగిలో వారబందీ పద్ధతిలో సాగునీరు విడుదల చేస్తామని ప్రకటించిన ఇరిగేషన్ అధికారులు... ఇప్పుడు నాలుగు రోజులే నీళ్లు ఇవ్వడంతో వరి పొలాలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల అనాలోచిత నిర్ణయాల మూలంగా కడెం నీరు జన్నారం వరకు, గూడెం లిఫ్ట్ నీళ్లు దండేపల్లి నుంచి దిగువ ప్రాంతానికి పుష్కలంగా అందుతున్నాయన్నారు. మధ్యలో ఉన్న జన్నారం మండలంలోని చింతగూడ, మహ్మదాబాద్, తపాలాపూర్, రాంపూర్లతో పాటు దండేపల్లి మండలంలోని తాళ్లపేట, నాగసముద్రం, లింగాపూర్, మేదరిపేట శివారు పొలాలకు నీళ్లు అందక పొలాలు బీళ్లు వారుతున్నాయని వాపోయారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి వారబందీ పద్ధతి ద్వారా క్రమం తప్పకుండా సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఆందోళన సమాచారం అందుకున్న జన్నారం ఎస్సై మధుసూదన్ రావు, దండేపల్లి ఎస్సై శ్రీకాంత్‌లు చెక్ పోస్ట్ వద్దకు చేరుకొని రైతులను సముదాయించి పంపించారు.
ఇదీ చదవండి: ఆరోగ్యం.. ఆనందం... ఈ నందనవనం!