మంచిర్యాల జిల్లాను కరోనా కలవర పరోస్తోంది. మంగళవారం 17 మంది నమూనాలను సేకరించి పరీక్షల కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్ పంపించగా అందులో నలుగురికి పాజిటివ్ వచ్చింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 150 నమూనాలు సేకరించగా.. కేసుల సంఖ్య మూడు పదులకు చేరింది.
గాంధీ ఆస్పత్రికి తరలింపు
ఐదుగురు ముంబై వలసదారుల్లో జన్నారం మండలానికి చెందిన ఇద్దరికి వైరస్ ఉన్నట్లు తేలింది. వలసదారుల కుటుంబ సభ్యులు 11 మంది నుంచి నమూనాలు సేకరించగా లక్షెట్టిపేట మండలానికి చెందిన మరో ఇద్దరికి కరోనా సోకినట్ల తేలింది. జిల్లాలో హోమ్ క్వారంటైన్లో 3311, ప్రభుత్వ క్వారంటైన్లో 28 మంది, ఐసోలేషన్‌లో 17 మంది ఉన్నారు. పాజిటివ్ వచ్చిన నలుగురిని ఈ రోజు తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రికి తరలించారు.
పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూతురు ప్రసవం
మొన్నటి వరకు వలసదారులకు మాత్రమే కరోనా పాజిటివ్ రాగా ఇప్పుడు స్థానికులకు సోకుతోంది. లక్సెట్టిపేటకు చెందిన వలస కూలీకి పాజిటివ్ రాగా ఇప్పుడు అతని భార్య, కుమారుడికి వైరస్ సోకింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూతురు మంచిర్యాల జిల్లాలోని నందిని ప్రసుతి ఆస్పత్రిలో ప్రసవం కాగా వైద్య ఆరోగ్య శాఖ.. ఆసుపత్రి సిబ్బందిని క్వారంటైన్ చేశారు.
తల్లీబిడ్డల నమూనాలను సేకరించి పరీక్షకు పంపగా నెగిటివ్ రావడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఊరట లభించింది. కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని స్వీయ నియంత్రణనే శ్రీరామరక్ష అని జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి అన్నారు.
ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!