కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు డిమాండ్ చేశారు. తనకు పదవులు, గుర్తింపు లేకున్నా ధైర్యంగా ఉంటానని, అదే కార్యకర్తలకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంచిర్యాలలో శనివారం రాత్రి నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బోధ్, ఖానాపూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల పదవులను మార్చినందుకు మండిపడ్డారు. ఆయా నియోజకవర్గాల్లో గతంలో తాను అనేక మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను గెలిపించుకున్నానన్నారు. ఒక్క పూట అన్నం తిని పార్టీ కోసం కష్టపడే నాయకులుంటే, వారికి పదవులు ఇవ్వకుండా మహేశ్వర్‌రెడ్డి, సాధిక్ ఖాన్లు మార్చడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తల కృషితోనే ఇంద్రవెళ్లిలో సభ విజయవంతమైందని.. అయినా స్థానిక నేతలు తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ప్రేమ్‌సాగర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాను విధించిన గడువులోగా తన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని.. లేకుంటే ఈనెల 11న ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది కార్యకర్తలను హైదరాబాద్ తీసుకెళ్లి పార్టీ పెద్దలను కలుస్తామని చెప్పారు.
ఇదీచూడండి: Revanth Reddy comments: కేసీఆర్‌కు మద్యం షాపులపై ఉన్న ప్రేమ.. రైతుల మీద లేదు