CM KCR Speech in BRS Public Meeting at Mancherial : కాంగ్రెస్ హయాంలో రిజిస్ట్రేషన్లు కావాలంటే లంచాలు ఇవ్వాల్సిందేనని.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ధరణి పోర్టల్(Dharani Portal) తేవడం వల్ల అర్ధగంటలోపు రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. కానీ అలాంటి ధరణిని కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తే తీసి బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని మండిపడ్డారు. ఈ పోర్టల్‌ను తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు.
ప్రజల కట్టే పన్నులు రైతుబంధు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ అంటుందని.. రైతుబంధు దుబారానా అంటూ సభికులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రైతుబంధు రూ.16వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. మరోవైపు రైతులకు 3 గంటలు కరెంటు చాలని రేవంత్‌రెడ్డి అంటున్నారు.. ఆ కరెంటు సరిపోతుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
BRS Praja Ashirvada Sabha at Mancherial : కాంగ్రెస్ హయాంలో రిజిస్ట్రేషన్లు కావాలంటే లంచాలు.. కానీ ప్రస్తుతం రైతు బొటనవేలు పెట్టగానే భూయాజమాన్య హక్కులు మారుతున్నాయని కేసీఆర్ హర్షించారు. కేంద్రం వద్ద అప్పులు తెచ్చి సింగరేణి(Singareni Collieries Company)లో కేంద్రానికి వాటా ఇచ్చారని ధ్వజమెత్తారు. కానీ ఇప్పుడు సింగరేణి కార్మికులు ఇళ్లు కట్టుకుంటే రూ.10 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకు - కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఉండదు : కేసీఆర్
కాంగ్రెస్ హయాంలో ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు ఉండేవని సీఎం కేసీఆర్ ఆవేదన చెందారు. గోదావరి ఒడ్డున ఉన్న ప్రాంతాలకు హస్తం పార్టీనే నీళ్లు ఇవ్వలేకపోయిందని దుయ్యబట్టారు. ఆనాడు ఎమ్మెల్యేలను కొని బీఆర్ఎస్(టీఆర్ఎస్)ను చీల్చాలని చూసిందని పేర్కొన్నారు. ఆనాడు కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్నట్లు ప్రత్యేక రాష్ట్రానికి ఫైట్ చేశానని చెప్పారు.
"రేపు ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎట్లా వస్తాయి. అప్పుడు వైకుంఠం ఆటలో పెద్ద పాము మింగినట్లు అవుతుంది. ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీకే కట్టపెట్టింది. నిజాం కాలంలో 134 ఏళ్ల క్రితం ప్రారంభమైన కంపెనీ సింగరేణి సంస్థ. ఆ సంస్థలో కార్మికులకు ఇళ్లు కట్టుకోవడానికి రూ.10 లక్షలు.. వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం." - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
CM KCR Fires on BJP : దేశవ్యాప్తంగా కేంద్రం 157 మెడికల్ కళాశాలలలు ఏర్పాటు చేసిందని.. అందులో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టంలో ఉన్నా.. ఇప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వకుండా చట్టాన్ని ఉల్లంఘించారన్నారు. అలాంటప్పుడు ఒక్క కాలేజీ ఇవ్వని బీజేపీకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.
జాగ్రత్తగా ఓటు వేయకుంటే చేసిన అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది : కేసీఆర్
ప్రచారంలో దూసుకెళుతున్న బీఆర్ఎస్ - నమ్మి ఓటేస్తే మళ్లీ పాతరోజులొస్తాయని హెచ్చరిక