మత సామరస్యానికి మన దేశం ప్రతీకగా నిలుస్తోంది. ఒకరి పండగలకు మరొకరు హాజరవుతూ ఉంటారు. అలాగే కులమతాలకు అతీతంగా ముస్లిం యువకులు అయ్యప్ప స్వాములపై తమ భక్తిని చాటుకున్నారు. ఐక్యతకు చిహ్నంగా అయ్యప్ప స్వాములకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కమ్యూనిటీ హాల్లో సుమారు 100 మంది అయ్యప్ప మాలధారులకు పట్టణానికి చెందిన పలువురు ముస్లిం సోదరులు అల్పహారంతో పాటు అన్నదానం ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటారు.
ఎంతో కఠోరమైన అయ్యప్ప దీక్ష చేస్తున్న భక్తులకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని మైనారిటీ యూత్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు ఎండీ సోహైల్ఖాన్ అభిప్రాయపడ్డారు. కుల మతాలు వేరైనా మానవత్వంతో సమభావనతో మెలగాలని కోరారు. అందులో భాగంగా అయ్యప్ప స్వాములకు అల్పహారం అందించడమే కాకుండా వారితో పాటు కలసి భుజించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
సంతోషంగా ఉంది..
మంచిర్యాల పట్టణంలో మతసామరస్యాన్ని నెలకొల్పేందుకు అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ముస్లిములు పవిత్రమైన రంజాన్ మాసంలో ఎలా అయితే పాటిస్తామో.. ఇప్పుడు స్వాములు 40రోజుల పాటు కఠోర దీక్షతో పూజలు చేస్తారు. హిందూ ముస్లిములు అందరూ ఐక్యంగా ఉండి.. ప్రశాంతతను చాటాలనే మంచి ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాం.
-ఎండీ సోహైల్ఖాన్, ముస్లిం యూత్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు
ఇదీ చదవండి: