Yasangi Cultivation in Palamuru: రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మెగ్గుచూపాలన్న ప్రభుత్వ సూచన యాసంగి సాగుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగువిస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. అటు ఇతర పంటల విస్తీర్ణమైనా పెరిగిందా అంటే అదీ లేదు. వేరుశనగ, మినుము మినహా మిగిలిన పంటల విస్తీర్ణం అంతంత మాత్రంగానే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 66 వేల ఎకరాలకు 24 వేలు, నారాయణపేట జిల్లాలో 70 వేల ఎకరాలకు 15 వేలు, వనపర్తి జిల్లాలో లక్షా 47 వేల ఎకరాలకు 57వేల ఎకరాలు, జోగులాంబ గద్వాల జిల్లాలో లక్ష ఎకరాలకు 40వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో మాత్రం 2 లక్షల ఎకరాలకు లక్షా 59వేల ఎకరాలు ఇప్పటికే సాగులోకి వచ్చాయి.
అంతంత మాత్రం..
ఇప్పటి వరకు సాగు చేసిన పంటల్లో వేరుశనగ ఎక్కువగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 22 వేల ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో లక్షా 38 వేలు , నారాయణపేట జిల్లాలో 13 వేలు, వనపర్తి 33 వేలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 13 వేల ఎకరాల్లో వేరుశనగ సాగుచేశారు. ఉమ్మడి జిల్లాలో వేరుశనగ తర్వాత అత్యధికంగా 50 వేల ఎకరాల్లో మినుము పంట వేశారు. ఇవికాక మొక్కజొన్న, జొన్న, పప్పుశనగ, ఆముదం, మిరప, కూరగాయల పంటలు అంతంత మాత్రంగా సాగవుతున్నాయి. ఇతర పంటలు సాగు చేయాలంటున్న వ్యవసాయశాఖ అధికారులు అందుకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
సగానికి తగ్గిన సాగు విస్తీర్ణం..
Yasangi Cultivation news :ధాన్యం కొనబోమని ప్రభుత్వం స్పష్టం చేయటంతో... వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గనుంది. గత యాసంగిలో వరిసాగు చేసిన రైతులు ఈసారి వరి విస్తీర్ణాన్ని తగ్గించి వేయనున్నారు. ఇంటి అవసరాలు, పశుగ్రాసం కోసం వరిసాగు తప్పనిసరి కాగా... చౌడు పొలాలు, సాగునీటి ప్రాజెక్టుల కింది ఆయకట్టు, నీటి సౌకర్యం ఉన్న చోట.. వరి తప్ప మరో పంటకు వెళ్లేందుకు రైతులు మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలో వరి విస్తీర్ణం గత ఏడాదితో పోల్చుకుంటే సగానికి సగం పడిపోయే అవకాశం ఉంది.
భూముల్ని వదిలేసేందుకు సిద్ధం..
చెరువులు, కుంటలు, బోరుబావులు సహా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరు పుష్కలంగా అందుబాటులో ఉంది. పంటలకు అనుకూలమైన ఇలాంటి వాతావరణంలో ఆరుతడి పంటలే పండించాలని చెప్పడం రైతులను గందరగోళంలో పడేస్తోంది. ఈ నేపథ్యంలో యాసంగి పంట వేయకుండా భూముల్ని వదిలేసేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లా పేరు | సాధారణ సాగు విస్తీర్ణం | ప్రస్తుత సాగు విస్తీర్ణం | సాగైన శాతం |
మహబూబ్ నగర్ | 66,775 ఎకరాలు | 24,347 ఎకరాలు | 36 |
నారాయణపేట | 70,676 ఎకరాలు | 15,389 ఎకరాలు | 22 |
నాగర్ కర్నూల్ | 2,05,517 ఎకరాలు | 1,58,757 ఎకరాలు | 77 |
వనపర్తి | 1,47,984 ఎకరాలు | 57,983 ఎకరాలు | 39 |
జోగులాంబ గద్వాల | 1,03,568 ఎకరాలు | 40,281 ఎకరాలు | 39 |
ఇదీచూడండి: Black Chain Technology : బ్లాక్‌చైన్ భరోసా.. ఆర్గానిక్ ఉత్పత్తులో కాదో చెప్పేస్తుంది!