ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. 5 జిల్లాల వ్యాప్తంగా 17 కేంద్రాల్లో జరిగిన టీకా పంపిణీలో ఆన్లైన్లో నమోదు చేసుకుని కేంద్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి టీకా ఇచ్చి ఇంటికి పంపారు. మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాక్సినేషన్ ప్రారంభించగా... కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, భూత్పూరు, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.
29 మందికే...
జడ్చర్లలో 30 మందికి గాను 29 మందికే వాక్సినేషన్ చేశారు. ఒకరు గర్భిణీ కావడం వల్ల హాజరు కాలేదు. నారాయణపేట జిల్లాలో టీకా పంపిణీలో ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతమైనట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా కేంద్రాన్ని శాసనసభ్యుడు ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మొదటి విడతలో జిల్లాకు 1,040 వాయిల్స్ వచ్చాయని వీటిని ఫ్రంట్లైన్ వర్కర్లకు ఇస్తామని చెప్పారు. టీకా సురక్షితమైనదని, ఎలాంటి సమస్యలు రావని ధైర్యంగా టీకా చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నాగర్కర్నూల్...
నాగర్కర్నూల్ జిల్లాలో వాక్సినేషన్ పక్రియ విజయవంతమైనట్లు కలెక్టర్ శర్మన్ ప్రకటించారు. తొలిరోజు కల్వకుర్తి, తిమ్మాజిపేట రెండు చోట్ల, 60 మందికి వేశారు. తొలి విడతలో వైద్యారోగ్య శాఖ అంగన్వాడీ కార్యకర్తలకు ఈనెల 20లోగా 4,963 మందికి కరోనా వ్యాక్సిన్ అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఎంపీ రాములు వాక్సినేషన్ ప్రారంభించారు. నాలుగు కేంద్రాల్లోనూ సురక్షితంగా టీకా ప్రక్రియను ముగించారు. వనపర్తి జిల్లాలోనూ వాక్సినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రేవల్లిలో టీకా తీసుకున్న స్వీపర్ కళ్లు తిరిగి పడిపోగా వెంటనే చికిత్స అందించగా కోలుకున్నారు.
ఇదీ చూడండి : జల్లికట్టు వేడుకలో అపశ్రుతి- ఇద్దరు మృతి