TSPSC paper leakage effect on job seekers: ఏళ్లుగా ఎదురుచూశాక.. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా.. గ్రూప్-1 సహా వివిధ శాఖల్లో 80 వేల ఖాళీల భర్తీకి ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని విద్యావంతులైన నిరుద్యోగులు సుమారు లక్ష మంది నిద్రాహారాలు మాని పరీక్షలకు సన్నద్ధమయ్యారు. కొందరు హైదరాబాద్‌కు వెళ్లి.. లక్షలు వెచ్చించి కోచింగ్‌లు సైతం తీసుకున్నారు. మరికొందరు జిల్లా కేంద్రాల్లో గదులు అద్దెకు తీసుకుని.. గ్రంథాలయాల్లో చదువుతూ పరీక్షలకు సన్నద్ధమయ్యారు.
TSPSC paper leakage case updates : గ్రూప్-1 ప్రిలిమినరీ సహా పలు పరీక్షలకు హాజరై ఉద్యోగాలు వస్తాయని గంపెడాశలు పెట్టుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గ్రూప్-1 పరీక్షలు 23వేల మంది రాయగా.. 25శాతం మంది మెయిన్స్‌కి అర్హత సాధించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్షల రద్దుతో డీలా పడిపోయారు. మళ్లీ పరీక్షలు రాయాలంటే పోటీ పెరగుతుందని.. అంతకుముందు ఉన్న ఏకాగ్రత లేకుండా పోతోందని ఆందోళనకు గురవుతున్నారు.
పరీక్షలకు సిద్ధమవుతున్న గ్రామీణ యువతంతా నిరుపేద, మధ్యతరగతి, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. తల్లిదండ్రులు కూలీ చేసి పంపే సంపాదనతోనే పూట గడిచేది. సర్కారీ కొలువు కోసం ఇన్నాళ్లు పడ్డ కష్టం.. పరీక్షల రద్దుతో మరింత రెట్టింపయ్యాయని వాపోతున్నారు. గ్రూప్-1లో ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారు మళ్లీ సాధించగలమా అన్న మీమాంసలో కొట్టమిట్టాడుతున్నారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఏ కొలువుకూ వెళ్లకుండా సన్నద్ధతలో ఉన్నవారు ఆర్థికంగా తిప్పలు తప్పవని తిరిగి ఉద్యోగాల్లో చేరుతున్నారు.
ఈలోపు అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వస్తే పరీక్షల సంగతేంటని అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు గ్రంథాలయాల్లో మధ్యాహ్న భోజన వసతి కల్పించాలని కోరుతున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత పరీక్షల రద్దుతో తీవ్ర నిరాశలో ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తే ఆర్థికంగా ఊరట లభిస్తుందని ఉద్యోగార్థులు కోరుతున్నారు.
"నాలుగు సంవత్సరాల నుంచి గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. తర్వాత హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకోవడానికి వెళ్లాను. రెండు నెలలు ఉన్న తర్వాత ఇలా పేపర్ లీకేజీ విషయం బయటకు వచ్చింది. మాది పేద కుటుంబం.. ఇప్పుడు మళ్లీ ప్రిలిమ్స్ పరీక్ష రాయాలంటే భయంగా ఉంది." - గ్రూప్-1 క్వాలిఫై అయిన అభ్యర్థి
"రెండు సంవత్సరాల నుంచి గ్రూప్స్‌లో కోచింగ్ తీసుకున్నాను. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యాను. ఇప్పుడు చూస్తే ఇలా. జిల్లా కేంద్రంలో ఉండి.. లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నాను. మళ్లీ 3లక్షల మంది అభ్యర్థులతో కలిసి ప్రిలిమ్స్ రాయాలంటే.. మైండ్ సెట్ కావడానికి సమయం పడుతుంది." - గ్రూప్-1 క్వాలిఫై అయిన అభ్యర్థిని
ఇవీ చదవండి: