జిల్లావ్యాప్తంగా గతేడాది డెంగీ కేసుల నమోదు తక్కువగా ఉంది. ఈసారి జూన్ మాసం నుంచే కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. సాధారణంగా జులై మాసం ప్రారంభంలో కేసుల నమోదు అధికంగా ఉండేది. కాని గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో అసలు మెదడువాపు కేసుల నమోదు లేదు. ఈ ఏడాది పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కేసు నమోదైంది. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌నగర్‌లో సైతం ఇవే లక్షణాలతో ఓ బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ అధికారులు మాత్రం అలాంటిదేమీలేదని చెబుతున్నారు.
దృష్టి పెట్టాలి
మహబూబ్‌నగర్, జడ్చర్ల నుంచి జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ పురపాలిక పరిధిలోని వీరన్నపేట, ప్రేమ్‌నగర్, టీడీగుట్ట, సద్దలగుండు, రాజేంద్రనగర్, బీకే రెడ్డి కాలనీల్లో ఎక్కువగా సమస్యలు ఉన్నాయి. ఇక్కడి నుంచే గతేడాది కేసులు అధికంగా నమోదయ్యాయి. జులై నుంచి సెప్టెంబరు నెలల మధ్య నమోదయ్యే కేసుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
శాఖలు సమన్వయం లేదు
ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నప్పటికీ శాఖలు సమన్వయంగా ముందుకు వెళ్లడం లేదు. చెత్త పేరుకున్న చోట కనీసం శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదు. అయినా వైద్య ఆరోగ్యశాఖ, పురపాలిక శాఖ అధికారులు సమన్వయం చేసుకొని పని చేయడం లేదు. సమన్వయ సమావేశాలు పెట్టి చర్చించుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితాలు కనిపించడం లేదు. నామమాత్రంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా రెండు శాఖలు సమన్వయం చేసుకొని ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించకుంటే బాధితుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.
చర్యలు తీసుకుంటాం
జిల్లాలో వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి అప్రమత్తమయ్యాంమని జిల్లా మలేరియా నియంత్రణ అధికారి విజయ్‌కుమార్ తెలిపారు. పురపాలిక అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేశాం. పారిశుద్ధ్య లోపం కారణంగా డెంగీ, చికున్ గన్యా, జ్వరాలు వస్తున్నాయని చెప్పారు.
ఇదీ చూడండి : సూర్యాపేట జిల్లాలో ఇద్దరు ఆంధ్రావాసుల మృతి