పాలమూరు జిల్లాకే తలమానికమైన పిల్లలమర్రి సంరక్షణకు అటవీ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 2017 డిసెంబరులో చెదలు సోకి తెల్లపుండు రోగం ఆశించింది. అటవీశాఖ ఆధ్వర్యంలో 2018 ఫిబ్రవరిలో చికిత్సను ప్రారంభించారు. పిల్లలమర్రి ఊడలను భూమిలోకి పాతేలా చేసిన చికిత్స విజయవంతమైంది. మొత్తం 45 ఊడలను పీవీసీ పైపుల ద్వారా భూమిలో కలిపారు. ఇలా చేసేందుకు మరో 45 ఊడలు సిద్దంగా ఉన్నాయి. కొత్తగా వస్తున్న మరో 50 ఊడలను గుర్తించి భూమిలోకి పాతేందుకు కృషిచేస్తున్నారు. ఈ వృక్షానికి 2018 ఫిబ్రవరిలో ఐదు పద్ధతుల్లో చికిత్సను ప్రారంభించారు.
మొదటి విధానంలో వేర్లలో ఉన్న చెదలు తొలగించడానికి సేంద్రియ ఎరువులను మట్టిలో పిచికారి చేశారు. రెండు పద్ధతిలో కాండం మధ్యలో రంపంతో కోసి ఫంగస్ రాకుండా వాటిలో కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని నింపారు. మూడో విధానంలో చెదలు తొలగించడానికి సెలైన్ ఏర్పాటుచేసి పైపు ద్వారా క్లోరోపైరిపాస్ ద్రావణాన్ని అందించారు. నాలుగో పద్ధతిలో పడిపోతున్న పిల్లలమర్రి కొమ్మలకు ఆసరాగా తాత్కాలిక స్తంభాలను ఏర్పాటుచేశారు. ఐదో విధానంలో ఊడలు భూమిలో కలవడానికి చికిత్స విధానం కొనసాగుతోంది. రెండున్నరేళ్లుగా చేస్తున్న చికిత్స విధానంతో పిల్లలమర్రి పూర్వవైభవం సంతరించుకుంటోంది.
పిల్లల మర్రి చెట్టును , కొత్తగా వచ్చిన ఊడలను కలెక్టర్ వెంకట్రావ్ పరిశీలించారు. కొత్త ఊడలు వచ్చేలా చేసి పచ్చదనాన్ని నింపటంలో జిల్లా అటవీ శాఖ అధికారులు చేసిన కృషిని ఆయన అభినందించారు.