వర్షం మిగిల్చిన విషాదమిది. రేపటి గురించి ఆలోచిస్తూ నిద్రించిన ముగ్గురి జీవితాలు నిద్రలోనే ఆగిపోయిన కన్నీటి గాథ ఇది! ఏం జరిగిందో.. ఎందుకు చనిపోయామో.. తెలియకుండానే ఈ భువిని వదిలేసి వెళ్లిపోయిన తల్లీకూతుళ్ల ఆత్మ రోదన ఇది... వరుణుడు రాసిన మరణ శాసనమిది! ఇల్లు కూలి తల్లి, ఇద్దరు కూతుళ్లు మరణించిన విషాదమిది...
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఆ అమాయకుల ప్రాణాలు తీసింది. ఏమి జరుగుతుందో తెలిసే లోపే ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రశాంతంగా నిద్రపోయిన వారు కళ్లు కూడా తెరవకుండానే... శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఇంతకీ వారికి ఏమైంది? వారి మరణానికి, వర్షానికి సంబంధం ఏంటి?
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాలలో విషాదం చోటుచేసుకుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి శరణమ్మ, కుమార్తెలు వైశాలి, భవానిలు మృత్యువాత పడ్డారు.
విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ సీతారామరావు, జిల్లా అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.