ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాణాలకు ఎదురొడ్డి కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రులు ఈటల, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన వల్లే 5 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోగలిగామని మంత్రి కేటీఆర్ వివరించారు. 5 వైద్య కళాశాల్లో దాదాపు వెయ్యి పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ కిట్ వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని మంత్రి స్పష్టం చేశారు.
కంటి వెలుగు పథకం కింద గ్రామాల్లోనే కోట్ల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ఇంకా నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాకు చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు భయపడుతున్నాయన్న ఆయన.. ప్రభుత్వ వైద్యులు మాత్రం భయపడకుండా రోగులను చేర్చుకుంటున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఇదీచూడండి: వరంగల్ నిట్‌లో చిట్టడవి.. ఎలా సాధ్యమైందో తెలుసా..?