హైదరాబాద్‌కు చెందిన రైల్వే కాంట్రాక్టర్ దోసడ వెంకట్ రెడ్డి(51) తాను ఆత్మహత్య చేసుకునే ముందు.. తాను పనిచేసే చోట ఉంటున్న క్యాంపు కార్యాలయంలో సూసైడ్ నోట్‌ను దొరికింది. ఓ డైరీలో తన ఆత్మహత్యకు గల కారణాలను రాసి ఉంచి, అక్కడి నుంచి దేవరకద్రకు చేరుకొని.. రైలు పట్టాలపై తలవుంచి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు.
సూసైడ్ నోట్ ప్రకారం..
తాను చనిపోవడానికి రైల్వే డిప్యూటీ సీఈ ఎస్కే శర్మ కారణమని పేర్కొన్నారు. ఫిబ్రవరి 22వ తేదీన రాత్రి 10-11 గంటల మధ్య మాగనూరు కాంట్రాక్టర్ క్యాంపు కార్యాలయం సదరు అధికారి మద్యం మత్తులో అందరి ఎదుట తనను పరుష పదజాలంతో దూషించినట్లు లేఖలో రాశారు. అలాగే ఫిబ్రవరి 28న సైతం తనను సైట్ నుంచి వెళ్లిపోవాలని వారు బాధించినట్టు లేఖలో రాసి ఉంది. శర్మతో పాటు సీపీ డబ్ల్యూఐ ఎన్బీ శ్రీనివాస రావు తనను ఇబ్బంది పెడుతూ దూషించే వారని ఆత్మహత్యకు ముందు లేఖలో పేర్కొని.. అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు క్యాంపు కార్యాలయంలో దొరికిన వెంకట్ రెడ్డి డైరీ ద్వారా బంధువులకు తెలిసింది. బాధితుడి బంధువులు రైల్వే ఉన్నతాధికారులకు సూసైడ్ నోట్ ఆధారంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
కాంట్రాక్టర్ ఆత్మహత్యకు అధికారులు తీరే కారణమని తెలుసుకున్న రైల్వే గుత్తేదారుల నాయకులు.. దక్షిణ మధ్య రైల్వే కాంట్రాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే నిలయం ఎదుట నిరసన తెలుపనున్నట్లు సమాచారం.
వెంకట్‌రెడ్డి ఆత్మహత్యకు ప్రధాన కారణం రైల్వే అధికారులు పరుష పదజాలం మాటలే అని తెలియడం వల్ల మృతుడి కుటుంబంలో మరింత విషాద ఛాయలు నెలకొన్నాయి.