మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని నెల్లికొండి గ్రామంలో పక్క పక్కనే నివాసం ఉన్నఇరు కుటుంబాల మహిళల మధ్య జరిగిన ఘర్షణపై బాధిత మహిళ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై ఎస్సై సకాలంలో స్పందించకపోవడం వల్ల తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మి (29) ఇంట్లో ఉన్న మాత్రలు అన్నింటిని ఒక్కసారిగా నోట్లో వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైన బాధితురాలి బంధువులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
సకాలంలో స్పందించని ఎస్సైని సస్పెండ్ చేయాలని, ఫిర్యాదు విషయంలో జాప్యం చేయడానికి కారకులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచి సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ డీఎస్పీ శ్రీధర్ సంఘటనా స్థలానికి చేరుకొని.. ఎస్సై సంతోష్‌ను జిల్లా కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై పూర్తి విచారణ చేసి బాధితురాలి కుటుంబానికి సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళనను విరమించారు.
ఇవీ చూడండి: పోలీసుల దురుసు ప్రవర్తనను ప్రశ్నించిన హైకోర్టు