ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇదివరకు 228 పరీక్ష కేంద్రాలు ఉండగా.. కరోనా నిబంధనల నేపథ్యంలో ఇపుడు మరో 141 అదనంగా చేరనున్నాయి. దీనివల్ల అదనంగా ఇన్విజిలేషను బాధ్యతలు ఇవ్వాల్సిన ఉపాధ్యాయుల కోసం ఉత్తర్వులను సిద్ధం చేస్తున్నారు. కొత్తగా గుర్తించిన పరీక్షల కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి పెడుతున్నారు. పెరిగిన పరీక్ష కేంద్రాలకు అనుగుణంగా ఫర్నీచరు లేకపోవటం వల్ల చాలాచోట్ల విద్యార్థులు నేల మీద కూర్చొని పరీక్షలు రాయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గతంలో ప్రతి గదికి 24 మంది విద్యార్థులను కేటాయించేవారు. ప్రస్తుతం ఒక్కో గదికి 12 మంది మాత్రమే ఉంటారు. పాత పరీక్ష కేంద్రాలున్నచోట ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలుంటే వాటిలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదుపాయం లేనిచోట సమీపంలోని ప్రైవేటు పాఠశాలల భవనాలను గుర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంత పరీక్ష కేంద్రాల్లో సదుపాయాల సమస్య మరీ తీవ్రంగా ఉంది.
పరీక్షల నిర్వహణలో ఈ సారి సిబ్బంది కూడా భారీగా పెరగనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో 700 మంది విధులు నిర్వహించగా.. తాజాగా 1300కు ఆ సంఖ్య పెరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో గతంలో 556 మంది ఇన్విజిలేటర్లు ఉండగా.. ప్రస్తుతం 325 మందికి అదనంగా విధులు కేటాయిస్తున్నారు. వనపర్తి జిల్లాలో గతంలో 446 మంది ఉండగా.. మరో 260 మంది, నారాయణపేట జిల్లాలో ఇదివరకు 350 మంది ఉండగా, అదనంగా మరో 350 మంది, జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో 430 మంది ఉండగా తాజాగా మరో 309 మంది ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వులను ఇవ్వనున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా పరీక్ష కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నామని మహబూబ్‌నగర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి తెలిపారు.