ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్ సహకరించకపోవడంతో చాలాచోట్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వచ్చిన వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు, నాలుగు రోజులుగా ఇదే సమస్య ఉండటంతో గత రెండు రోజులుగా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ల లావాదేవీలే ఇప్పటికీ పూర్తి కాలేదు. నిన్న స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోజుకు 48 వరకూ స్లాట్లు బుక్ అవుతాయి. రోజులో 70వరకూ లావాదేవీలు పూర్తి చేస్తారు. కానీ సర్వర్ ఇబ్బంది పెడుతుండటంతో కాగితాలపై లావాదేవీలు పూర్తి చేస్తున్నారు. దీంతో లావాదేవీల సంఖ్య 20కంటే దిగువకు పడిపోయింది. లాక్డౌన్ కారణంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకే లావాదేవీలకు అనుమతి ఉంది. ఉన్న సమయంలో సర్వర్ సతాయిస్తుండటంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. అన్నీ కలుపుకుని రోజుకు 400 నుంచి 500 వరకూ లావాదేవీలు జరుగుతాయి. దాదాపుగా అన్నిచోట్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. మహబూబ్నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, వనపర్తి, ఆత్మకూర్, అలంపూర్, గద్వాల, నారాయణపేట, మక్తల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి సైతం గండి పడుతోంది. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, వీలైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడు రోజులుగా 89 స్లాట్లు నమోదైతే కేవలం 19 రిజిస్ట్రేషన్లు మాత్రమే పాత విధానంలో పూర్తయ్యాయి. గద్వాలలో రోజుకు 24 స్లాట్లు నమోదవుతుండగా ఇవాళ కేవలం ఆరు రిజిస్ట్రేషన్లే పూర్తయ్యాయి. మక్తల్లో ఒకే ఒక్క లావాదేవీ జరిగింది. మహబూబ్ నగర్లో శుక్రవారం స్లాట్లు బుక్ చేసుకన్న వారి లావాదేవీలే పూర్తి చేస్తున్నారు. శనివారం స్లాట్ బుక్ చేసుకున్న వారిని తిప్పిపంపారు.
ఇదీ చదవండి: Vaccine : వ్యాక్సిన్ను భుజం కండరానికే ఎందుకు వేస్తారో తెలుసా?