మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నాలుగు గేట్లు ఎత్తారు. ఈ నేపథ్యంలో బండర్పల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దేవరకద్ర మండలంలోని కౌకుంట్లలో అంబలి చెరువు, తుమ్మల చెరువులు నిండి అలుగు పారాయి. కుంటలు తెగి గ్రామంలోని రైల్వే ట్రాక్, రాజోలి ఆర్యూబీ జలమయం అయ్యాయి. వరద నీరు భారీగా రావడం వల్ల కౌకుంట్ల, రాజోలి వెంకటగిరి, రేకులంపల్లి గ్రామాల్లో సుమారు రెండు వేల ఎకరాల పత్తి, పొలాలు నీట మునిగాయి.
గ్రామాలు జలమయం
చిన్న చింతకుంట మండలంలోని ముత్యాల చెరువు కట్టకు గండి పడింది. ముచ్చింతల, అప్పంపల్లి గ్రామాలు జలమయం అయ్యాయి. అప్పంపల్లి గ్రామంలోని బీసీ కాలనీకి వరద నీరు చేరడం వల్ల పలు కుటుంబాలు నిరాశ్రయులుగా మారాయి. సుమారు వెయ్యి ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అడ్డాకుల మండలంలోని చక్రపూర్ పెద్ద చెరువు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
పంట నీటమునిగింది
కందూరు, సుంకర రామయ్య పల్లి గ్రామాల మధ్య రహదారి కోతకు గురై రాకపోకలు స్తంభించాయి. మూడు రోజులుగా ముత్యాలమ్మ పల్లి, బలిదిపల్లి, గౌరీదేవి పల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో మండలంలో సుమారు ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. మూసాపేట మండలంలోని నిజలాపూర్ పెద్ద చెరువు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
ఇళ్లలోకి చేరిన నీరు
భూత్పూర్ మండలంలోని మద్దిగట్ల, వెల్కిచర్ల గ్రామాల్లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువకు గండి పడి పంటలు నీట మునిగాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రాత్రి కురిసిన వర్షానికి. పంటలు నీట మునగడం వల్ల పలు ఇళ్లకు నీరు చేరి బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి : నా పేరు మీద వచ్చే సందేశాలకు స్పందించకండి: సీఐ