Professor Haragopal on UAPA Case : ఉపా చట్టాన్ని ఎత్తివేసే దిశగా కేంద్రపై.. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఆచార్య హరగోపాల్ డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఈ చట్టాన్ని రద్దు చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చాలన్నారు. లేని పక్షంలో మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణ సర్కార్ స్పందించి సాక్ష్యాలు లేవంటూ తనతో పాటు మరో ఐదుగురిపై ఎత్తివేసిన విషయాన్ని గుర్తుచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే ఉపా చట్టం ఉన్న మరో 152 మందిపైనా కేసు వెనక్కి తీసుకోవాలని హరగోపాల్ సూచించారు. ఈ చట్టంకింద దేశద్రోహం కేసు పోలీసులు నమోదుచేస్తే.. నేరం రుజువు కాకపోయినా జైలు జీవితం అనుభవించాల్సి రావడం దారుణమని పేర్కొన్నారు. అందుకే చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంను (ఉపా) రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనకపోతే.. మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని హరగోపాల్ హెచ్చరించారు.
"ఉపా చట్టం ఎత్తివేసేలా కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తేవాలి. సాక్ష్యాలు లేవని ఆరుగురిపై ఉపా కేసు ఎత్తివేశారు. మిగిలిన 152 మందిపై పెట్టిన ఉపా కేసును ఎత్తివేయాలి. ఉపా చట్టం రద్దు చేస్తామని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలి. సామాజిక సమస్యను పరిష్కరించే పరిస్థితుల్లో లేని రాజ్యాలు.. బల ప్రయోగం చేయటం కోసమే ఇటువంటి కేసులు పెట్టే అవకాశం ఉంది. ఉపా చట్టాన్ని రద్దు చేయకుంటే మరో ఉద్యమం." - ఆచార్య హరగోపాల్
UAPA Case Against Professor Haragopal : రెండురోజుల క్రితం ఆచార్య హరగోపాల్‌పై తెలంగాణ పోలీసులు ఉపా కింద కేసు నమోదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు సంవత్సరం క్రితమే పెట్టినా ఆలస్యంగా బహిర్గతమైంది. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ అధ్యక్షుడు చంద్రమౌళిపై రెండు నెలల క్రితం ఉపా కేసు నమోదైంది. దీనిపై బెయిల్ కోసం ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా చంద్రమౌళిపై ఇంకా కేసులు ఉన్నాయంటూ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. వాటి వివరాలివ్వాలని న్యాయస్థానం ఆదేశించడంతో పోలీసులు తాడ్వాయి ఠాణా ఎఫ్‌ఐఆర్‌ను సమర్పించారు. అందులో చంద్రమౌళితోపాటు 152 మంది పేర్లున్నాయి. వారిలో హరగోపాల్ పేరుండటం తీవ్ర చర్చనీయాంశమైంది.
CM KCR Decision to Dismiss UAPA Case Against Haragopal : దీనిపై పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు స్పందించాయి. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆధారాలు లేకుండా ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం దారుణమని పేర్కొన్నాయి. వెంటనే కేసు ఎత్తివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ క్రమంలోనే అన్ని అంశాలను పరిశీలించిన సీఎం కేసీఆర్.. ఆచార్య హరగోపాల్ సహా ఇతరులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే హరగోపాల్ సహా ఆరుగురు పౌరహక్కుల నేతల పేర్లను తొలగిస్తున్నట్లు పోలీసుశాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి : దేశద్రోహం చట్టం అమలు నిలిపివేత.. సుప్రీంకోర్టు చరిత్రాత్మక నిర్ణయం