Problems Of Ayush Dispensaries: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆయుష్ విభాగం కింద పనిచేసే.. ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, నాచురోపతి డిస్పెన్సరీలు రోగులకు సేవలందించడంలోచతికిలపడుతున్నాయి. సరిపోను సిబ్బంది లేక, సొంతభవనాల కొరత, ఔషధాలు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 103 డిస్పెన్సరీలుండగా సగానికి పైగా వాటిలో వైద్యులు లేరు.
వైద్యులు లేని చోట్ల ఫార్మసిస్టులు సేవలందిస్తుండగా.. ఇద్దరూ లేనిచోట అలంకారప్రాయంగా మారాయి. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ ఆయుర్వేద ఆసుపత్రికీ ప్రస్తుతం వైద్యాధికారి లేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో ఆయుర్వేద ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది లేక ఫర్నీచర్ నిరుపయోగంగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 7, నారాయణపేట జిల్లాలో 6, వనపర్తి 8, నాగర్ కర్నూల్ జిల్లాలో 15చోట్ల వైద్యాధికారులు లేకపోవడంతో చాలాకాలంగా రోగులకు పూర్తిస్థాయి సేవలు అందడం లేదు.
డిప్యూటేషన్ల పేరుతో ఉన్నవైద్యులకు మరోచోట విధులు కేటాయించడం వల్ల గ్రామస్థాయిలో సేవలకు గండిపడుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకరు, నారాయణపేట జిల్లాలో ఇద్దరు, నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరుగురు, వనపర్తి జిల్లాలో నలుగురు వైద్యులు డిప్యూటేషన్ పేరిట మరోచోట విధులు నిర్వర్తిస్తున్నారు. గద్వాల జిల్లా క్యాతూరులో వైద్యుల్లేక నాలుగేళ్లుగా ఆయుర్వేద వైద్యశాల మూతపడి ఉంది.
వనపర్తి జిల్లా పెద్దమందడి, పెద్దగూడెం, ఖిల్లాగణపురం, మహబూబ్ నగర్ జిల్లా సీసీకుంట, నారాయణపేట జిల్లా కోస్గి మండలం గుండుమాల్లోని ఆయుష్ ఆసుపత్రులు మూతపడి ఏళ్లు గడుస్తోంది. వైద్యాధికారులు లేనిచోట ఆయుష్ విభాగంనుంచి మందులు అందట్లేదు. మహబూబ్‌నగర్ ఆయుర్వేద వైద్యశాలకు ఏప్రిల్ నుంచి ఔషధాలు సరఫరా కావడంలేదు. చాలాచోట్ల అరకొరగానే అందుబాటులో ఉన్నాయి.
వైద్యులు లేకపోతే ఫార్మసిస్టులు మందులివ్వొద్దన్న అధికారుల మౌకిక ఆదేశాలతో.. రోగులకు సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడింది. పాతరోగులకు మాత్రమే ఔషధాలిస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం ఆయుష్ విభాగంలో ఖాళీల భర్తీకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని.. ప్రకటన వెలువడితే సమస్య తీరుతుందని చెబుతున్నారు. మందుల కొరత లేకుండా చూస్తామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
"గత మూడు సంవత్సరాలుగా ఆయుర్వేద ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది లేరు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. రోగులు వచ్చి వెళ్లిపోతున్నారు. సరైన వసతులు కల్పించాలని కోరుతున్నాం." -స్థానికులు
ఇవీ చదవండి: Eamcet Results: ఎంసెట్ ఫలితాలు విడుదల.. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రారంభం