ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని అన్నిరకాల వైద్య సేవలు.. పల్లెలకు చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం పల్లె దవాఖానాలు ప్రారంభించింది. ఈ మేరకు హెల్త్ వెల్‌నెస్ సెంటర్లు, ఆరోగ్య ఉప కేంద్రాలను దశలవారీగా పల్లె దవాఖానాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎంబీబీఎస్ వైద్యులను వైద్యాధికారులుగా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.
పూర్తి కాని నియామకాలు: ప్రభుత్వ ఉద్దేశం గొప్పగా ఉన్నా క్షేత్రస్థాయి అమల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 595 ఆరోగ్య ఉప కేంద్రాలుండగా.. తొలి విడతగా 238 కేంద్రాల్లో వైద్యాధికారులను నియమించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ నియామకాలు పూర్తి కాలేదు. దూరభారం, వసతుల లేమి సహా తక్కువ ఆదాయం వంటి కారణాలతో ఉద్యోగం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
కనీసం నాలుగు గదులైనా: ఉప కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మార్చాలని నిర్ణయించిన సర్కారు.. తగిన వసతులు కల్పించే విషయాన్ని విస్మరించింది. 80 శాతం పల్లె దవాఖానాలకు ప్రస్తుతం సొంత భవనాలు లేవు. ఉన్నవాటిలోనూ అరకొర సౌకర్యాలతో వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కనీసం మంచినీళ్లు, కరెంటు సౌకర్యం అందుబాటులో లేదని చెబుతున్నారు. ఓ వైద్యాధికారి, ఇద్దరు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నిత్యం 20 నుంచి 50 మంది వరకు వచ్చే రోగులకు సేవలందిచాల్సిన పల్లె దవాఖానాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. రోగులకు పరీక్షలు, రోగనిర్ధరణ, గర్భిణీలకు యోగా వంటివి చేయించేందుకు.. కనీసం 2 నుంచి 4 గదులైనా అవసరమని సిబ్బంది చెబుతున్నారు.
పల్లె దవాఖానాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేదు. పీహెచ్సీ నుంచే కావాల్సిన మందులు, సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. కొన్నిరకాల ఇంజక్షన్లు నిల్వ చేసేందుకు ఫ్రీజర్‌ల అవసరం ఉన్నా.. ఏర్పాటు చేయలేదు. క్రమం తప్పకుండా ఇంజక్షన్లు తీసుకోవాల్సిన వారు.. రెండ్రోజులకోసారి డ్రెస్సింగ్ చేసుకునే వారు నిత్యం పీహెచ్సీ వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న పని. పల్లె దవాఖానాల్లోతో కొంత ఇబ్బంది తగ్గినా.. సదుపాయాలు మెరుగుపర్చాలనే వాదనలు వినిపిస్తున్నాయి. పల్లె దవాఖానాల్లో ప్రస్తుతం సాధారణ,ఓపీ, గర్భిణులకు నెలవారీ పరీక్షలు, చిన్నపిల్లలకు టీకాలు.. అసంక్రమిక వ్యాధుల నిర్ధారణ, మందుల పంపిణీ సహా పలు కార్యక్రమాలు అమలవుతున్నాయి.
"భవనం లేదు. ఇక్కడే ఓపీ పేషెంట్లను చూస్తాం. మంచినీళ్లు, కరెంటు సౌకర్యం అందుబాటులో లేదు. మరుగుదొడ్లు అందుబాటులో లేవు." -దేస్లి, రెండో ఏఎన్ఎం, కరివెన ఆరోగ్య ఉపకేంద్రం
"సబ్సెంటర్లు అంటే ప్రజలకు అవగాహన లేదు. భూత్పూర్ పీహెచ్సీకి వెళ్లాల్సిన అవసరం ఉండేది. నేను ఇక్కడి వచ్చాక మేము ఇక్కడే వైద్యం అందిస్తున్నాం. గర్భిణీలకు వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఇక్కడ ఒకటే గదిలో సేవలు అందిస్తున్నాం. రెండు మూడు గదులుంటే మరింత వైద్య సేవలు అందిచవచ్చు." -హిమబిందు, వైద్యాధికారి
ఇదీ చదవండి: మధుమేహ బాధితులకు కల్పతరువుగా ఉస్మానియా.. 'డయాబెటిక్ ఫూట్ కేర్' సూపర్ హిట్