రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భూనిర్వాసితులు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం పెంచడంతో కృష్ణానది వెనుక జలాల్లో ఉప్పేరు, గార్లపాడు గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాస కేంద్రంతో పాటు.. ముంపు నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 98 తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించి జోగులాంబ గద్వాల కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేందుకు అర్హుల జాబితాను మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయానికి పంపారని బాధితులు తెలిపారు.
అయితే మహబూబ్ నగర్ నుంచి వెళ్లాల్సిన అర్హుల జాబితా దస్త్రం 18 నెలలుగా పెండింగ్ లో ఉందని ఆరోపించారు. ప్రభుత్వానికి అందజేయడం లేదంటూ కలెక్టర్ కార్యాలయం ముందు బాధితులు నిరసన చేపట్టారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా స్పందించడంలేదని వాపోయారు. రెండు గ్రామాలకు కలిపి 150 మందికి ఉద్యోగ అర్హత ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: రైల్వే వంతెన కింద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం