రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభంపై అయోమయం నెలకొంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం వల్ల.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాల్లో సందిగ్ధత నెలకొంది. మహబూబ్నగర్ జిల్లాలో 252 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిల్లో ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులు 37 వేల మంది, 6 నుంచి 10 వరకూ చదివే విద్యార్థులు 22 వేల మంది ఉన్నారు. వీటిలో ఇంటర్నేషనల్, కార్పొరేట్ పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వ ఆదేశాలు లేకపోవడం వల్ల బడ్జెట్ స్కూళ్లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొనసాగుతున్నాయి.
ప్రైవేట్ స్కూళ్లలో చదివే 70 శాతం మంది విద్యార్థులు చదివేది బడ్జెట్ స్కూళ్లలోనే. కరోనా నేపథ్యంలో పాఠశాలలు ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో మూతపడ్డాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటం వల్ల.. బడుల ప్రారంభంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు రావడం లేదు.
కొవిడ్ నిబంధనలతో పాఠశాలల్ని తెరిచేలా అనుమతులివ్వాలి..
7 నుంచి 10 వ తరగతి వరకూ కొన్ని పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నా.. విద్యార్థుల హాజరు శాతం 30 శాతానికి మించడం లేదు. పుస్తకాలు, ఫీజులు, తరగతుల నిర్వహణపై తల్లిదండ్రులు యాజమాన్యాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అటు సాధారణ స్థాయి ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణ కష్టసాధ్యంగా మారుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ.. పాఠశాలల్ని తెరిచేలా వీలైనంత త్వరగా అనుమతులివ్వాలని యాజమాన్యాలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి.
అటు బోధన, బోధనేతర సిబ్బంది ఇప్పటికే వేతనాలు లేక అవస్థలు పడుతుండగా.. విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు. ఉపాధి లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోగా.. బడులనే నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది.
తల్లిదండ్రుల్లో ఆందోళన..
ఇప్పటికే పిల్లలు బళ్లు లేక నేర్చుకున్న చదువు మరిచిపోయారు. ఆన్లైన్ తరగతులున్నా.. వాటి వల్ల చదువు పిల్లలకు అబ్బడం లేదు. స్మార్ట్ఫోన్, డాటా కొరత, సరిగ్గా వినిపించక పోవడం, దృశ్యం కనిపించకపోవడం.. ఇలా ఆన్లైన్ సమస్యలు కోకొల్లలు. తమ పిల్లలు చదువులో ఏడాది వెనక బడిపోతారేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికైనా విద్యారంగంపై ప్రభుత్వం స్పందించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెరవడమో.. లేదంటే అందరికీ ఆన్లైన్ క్లాసులు నిర్వహించడమో చేయాలని కోరుతున్నారు.
ఇదీచూడండి: 'కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి భారీ బడ్జెట్ అవసరం'